VZM: బొబ్బిలికి చెందన ప్రముఖ తప్పేటగుళ్ల కళాకారుడు నీలబోను సత్యం ఉగాది పురస్కారం అవార్డు అందుకున్నారు. గురువారం అమరావతిలో జరిగిన ఉగాది పురస్కారం వేడుకల్లో CM చంద్రబాబు చేతులు మీదుగా అవార్డు అందుకున్నారు. ఆయనను బొబ్బిలి MLA బేబినాయన ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం సత్యం మాట్లాడుతూ.. తప్పేటగుళ్ల ప్రదర్శనలో ఉగాది పురస్కారం అందుకోవడంతో ఆనందంగా ఉందన్నారు.
సత్యసాయి: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా కదిరి శ్రీ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో పంచాంగ శ్రవణం ఘనంగా సాగింది. వేద మంత్రోచ్చారణల మధ్య జ్యోతిష్య పండితులు నూతన సంవత్సర రాశిఫలాలు, ఆదాయ వ్యయాల వివరాలను భక్తులకు వివరించారు. ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.
SKLM: నూతన సంవత్సరంలో జిల్లా సమగ్ర అభ్యున్నతికి సమష్టిగా కృషి చేద్దామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. గురువారం స్థానిక డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కళా వేదికలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే శంకర్ పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు. ప్రజలు అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి చెందే విధంగా ప్రణాళికతో ముందుకు సాగాలని కలెక్టర్ అన్నారు.
విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాలతో గురువారం నగరంలో మాదకద్రవ్యాల నియంత్రణకు ముమ్మర తనిఖీలు చేపట్టారు. గోపాలపట్నం రైల్వే స్టేషన్ సమీపంలో మార్క్, లక్కీ అనే నార్కోటిక్ డాగ్స్ సహాయంతో జరిపిన సోదాల్లో ఒక వ్యక్తి వద్ద రెండు కిలోల గంజాయి లభ్యమైంది. సమర్థవంతంగా పనిచేసిన పోలీసు సిబ్బందిని, డాగ్ హ్యాండ్లర్లను సీపీ అభినందించారు.
E.G: చారిత్రక కడియం బొబ్బిలి బ్రిడ్జి సెంటర్‌ను విస్తరించి, వ్యాపార, వాణిజ్య కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి అన్నారు. కడియం మండల టీడీపీ అధ్యక్షుడు వెలుగుబంటి నాని ఆధ్వర్యంలో స్థానిక మసీదులో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు ఆయన హాజరయ్యారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ.. మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
GNTR: గుంటూరు నగరంలోని నందివెలుగు, కాకాని రోడ్లపై పోలీసులు గురువారం ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన 922 మంది వాహనదారులకు రూ.5.36 లక్షల జరిమానా విధించినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. హెల్మెట్, సీటు బెల్ట్, లైసెన్స్ వంటి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు.
ASR: ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 23వ తేదీ మధ్యాహ్నం నక్కపల్లి మండలం చందనాడ వద్ద ఆర్సెలాల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 3.05 గంటలకు విశాఖ చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో నేరుగా నక్కపల్లి మండలం చందనాడ వెళ్తారు.
NTR: రాబోయే 3 రోజుల పాటు అకాల వర్షాలు, వడగండ్ల వానల అవకాశాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ లక్ష్మీశ గురువారం ఆదేశించారు. విజయవాడ కలెక్టరేట్లో ఆయన మాట్లాడుతూ.. పట్టణాలు, గ్రామాలలో నీరు నిల్వ కాకుండా సరైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, ఎక్కడైనా నీటి నిల్వలు ఏర్పడితే తక్షణమే తొలగించే చర్యలు తీసుకోవాలని సూచించారు.
SKLM: పాతపట్నం నియోజకవర్గ ప్రజల దీర్ఘకాల కోరిక నెరవేరింది. ఇవాళ ఉదయం 10 గంటలకు రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్ ట్రైన్ పాతపట్నంలో హాల్ట్ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కార్యాలయం గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
PPM: సాలూరులో వంద పడకల ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి ఇవాళ ప్రారంభం కానుంది. సుమారు రూ.17 కోట్ల నాబార్డ్ నిధులతో నిర్మించబడ్డ ఆసుపత్రి భవనాలను ఇవాళ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి చేతులమీదుగా ప్రారంభించనున్నట్లు ఆసుపత్రి వర్గాలు గురువారం ఓ ప్రకటనలో తెలిపాయి. ఈ ఆసుపత్రి ప్రారంభంతో పడకల కొరత తీరుతుందని ఆసుపత్రి కమిటీ సభ్యులు తెలిపారు.
ATP: అనంతపురం రైల్వే స్టేషన్‌లో మహిళల భద్రతపై పోలీసులు అవగాహన కల్పించారు. శక్తి యాప్ వినియోగం, BNS చట్టాల ప్రాముఖ్యతను వివరించారు. సైబర్ నేరాలు, సోషల్ మీడియా దుర్వినియోగం పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆపద సమయంలో డయల్ 100, 112, చైల్డ్ లైన్ 1098, మహిళా హెల్ప్‌లైన్ 181, 1091 నెంబర్లను సంప్రదించాలని కోరారు.
NDL: అవుకు మండలంలోని శ్రీ ఏర్రమల్లకంబగిరి స్వామి ఆలయంలో శుక్రవారం సమీక్షా సమావేశం జరుగనుంది. రాష్ట్ర రోడ్డు భవన నిర్మాణ శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి పాల్గొననున్నారు. సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ సమావేశానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు హాజరుకావాలని మంత్రి క్యాంపు కార్యాలయం విజ్ఞప్తి చేసింది.
కృష్ణా: మచిలీపట్నం నగరపాలక సంస్థ అధికారులతో జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ ప్రత్యేక పాలన అధికారి బాలాజీ గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల మార్చి మాసంతో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న దృష్ట్యా ప్రజలందరూ వారికి సంబంధించిన పన్నులను చెల్లించి, మచిలీపట్నం నగర అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.
GNTR: తెనాలి బోసురోడ్డులోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో గురువారం ఉగాది వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సహస్ర గళ హనుమాన్ చాలీసా పారాయణంలో వందలాది మంది భక్తులు ఏకకాలంలో పాల్గొని స్వామిని స్మరించుకున్నారు. అనంతరం శ్రీ ములుకుట్ల విశ్వనాథ శర్మ నిర్వహించిన పంచాంగ శ్రవణాన్ని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆసక్తిగా వీక్షించారు.
NDL: శ్రీశైల దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి బుట్టే వీరభద్ర దైవజ్ఞ ఉగాది పర్వదినం సందర్భంగా పంచాంగ శ్రవణం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర పాలన ప్రజలకు అనుకూలంగా ఉంటుందని తెలిపారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి, దేశం సుభిక్షంగా ఉంటుందని, ప్రజలు ఆనందంగా జీవిస్తారని పేర్కొన్నారు. గోవులు అధికంగా పాలు ఇస్తాయని, దేశంలో గ్రహణాలు కనిపించవని వెల్లడించారు.