AKP: గంజాయి రవాణా కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగారా శిక్షతోపాటు రూ.లక్ష జరిమానా విధిస్తూ చోడవరం కోర్టు జడ్జి హరి నారాయణ తీర్పు ఇచ్చినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి సుధీర్ గురువారం తెలిపారు. 2014 ఆగస్టులో వరంగల్‌కు చెందిన మండా జీవన్ 440 కిలోల గంజాయి రవాణా చేస్తూ మాడుగుల ఎక్సైజ్ అధికారులకు పట్టుబడినట్లు తెలిపారు. నేరం రుజువు కావడంతో శిక్ష పడిందన్నారు.
TPT: శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో పరాభవ నామ సంవత్సరం సందర్భంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయు లింగేశ్వరుడు పర్వత, చప్పర వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా ఆలయంలో స్వామి, అమ్మవార్లను వివిధ రకాల ఆభరణాలు, పుష్పాలతో సుందరంగా అలంకరించారు. స్వామివారు మేరు పర్వత వాహనంపై, అమ్మవారు చప్పర వాహనంపై అధిష్టించి పురవీధులలో ఊరేగించారు.
అన్నమయ్య: చిట్వేలు మండలానికి చెందిన విద్యార్థి మొకం వెంకట సాకేత్ యాదవ్ జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష-2026లో 91.25 మార్కులతో రాష్ట్ర స్థాయిలో ఉత్తీర్ణుడై నవోదయ సీటు సాధించాడు. శ్రీ సాయి వికాస్ హైస్కూల్‌లో చదువుతున్న సాకేత్ క్రమశిక్షణ, పట్టుదల, గురువుల మార్గదర్శకత్వంతో ఈ విజయం సాధించాడు. తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం అతని విజయంపై ఆనందం వ్యక్తం చేశారు.
AKP: నక్కపల్లి మండలం వేంపాడు ఎంపీపీ స్కూల్లో ఇద్దరు ఉపాధ్యాయుల మధ్య తలెత్తిన వివాదం సామరస్య పూర్వకంగా పరిష్కారం అయింది. తనపై తోటి ఉపాధ్యాయుడు శివాజీ దురుసుగా ప్రవర్తించి కులం పేరుతో దూషించారని హెచ్ఎం చిరంజీవి నక్కపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గ్రామపెద్దలు వీరిమధ్య రాజీ కుదిర్చారు.
ప్రకాశం: సింగరాయకొండ ఆర్టీసీ బస్టాండ్ వెనుక వైపు మూలగుంటపాడు రోడ్డులో ట్రాన్స్‌ఫార్మర్ ఉంది. దీనిపైకి చెట్టు కొమ్మలు పెరిగాయి. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి. ఎవరైనా పొరపాటున ట్రాన్స్‌ఫార్మర్ తాకితే షాక్ తగిలే అవకాశం ఉంది. విద్యుత్ శాఖ అధికారులు ఎలాంటి ప్రమాదం జరగకముందే తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
GNTR: అన్నం పూర్ణచంద్రరావు నవ్య వారాహి ప్రైవేట్ లిమిటెడ్, ట్రేడ్ దోస్త్ పేర్లతో అరండల్ పేటలో ఆఫీస్ ఏర్పాటు చేశాడు. రూ.1 లక్ష పెట్టుబడికి రూ.2 లక్షలు లాభం, డ్రాలో 40 గ్రాముల బంగారం ఇస్తానని చెప్పి డబ్బులు వసూలు చేసి ఈనెల 14న పరారయ్యాడు. బాధితురాలు చింతా శివ కోటేశ్వరి ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
VSP: P.M.పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో కుటుంబ కలహాల వలన ఒక మహిళ తన కుమార్తెతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో మహిళ కనిపించలేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు P.M.పాలెం పోలీసులు విస్తృతంగా గాలించి గురువారం వారి ఆచూకీ కనుగొన్నారు. మహిళ, తన కుమార్తెను వారి కుటుంబ సభ్యులుకు క్షేమంగా అప్పగించారు.
W.G: గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధిలో దాతలు పోషించే పాత్ర వెలకట్టలేనిదని ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కొనియాడారు. గురువారం వాండ్రంలో ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వివేకానంద పార్కుకు పునాది రాయి వేయడంతో పాటు రైతు సేవా కేంద్రం, గ్రామ సమైక్య భవనం, రామాపురం కాలనీ రింగ్ రోడ్డును ప్రారంభించారు.
ATP: ఉమ్మడి అనంతపురం జిల్లాలో రానున్న ఐదు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు విజయ్ శంకర్ బాబు, నారాయణస్వామి తెలిపారు. పగటి ఉష్ణోగ్రతలు 37.6 నుంచి 38.9 డిగ్రీల వరకు నమోదవుతాయని పేర్కొన్నారు. ఆగ్నేయం నుంచి గంటకు 10 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వివరించారు.
VZM: కొత్తవలస మండలలో గురువారం ఓ గుర్తుతెలియని మృతదేహం కలకలం సృష్టించింది. పాత కొత్తవలస సమీపంలో న్మశాన వాటికకు వెళ్లే రహదారి బంధలో మృతదేహం బయటపడింది. అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి భయాందోళన చెందారు. వెంటనే VRO రాధాకృష్ణకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుని ముఖం గుర్తుపట్టలేనంతగా ఉండడంతో అతని వివరాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
KRNL: కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమార స్వామిని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలోని కేంద్ర మంత్రి కుమార స్వామి నివాసంలో ఎంపీ శాలువాతో సత్కరించారు. ఈ సందర్బంగా జిల్లాలో ప్రతిపాదిత పారిశ్రామిక ప్రాజెక్టుల పురోగతి, కొనసాగుతున్న అభివృద్ధి పనుల గురించి మంత్రికి వివరించారు.
E,G: కొంతమూరు సబ్ స్టేషన్ పరిధిలో శుక్రవారం విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తున్నట్లు ఈఈ నక్కపల్లి శామ్యూల్ తెలిపారు. ఆర్డీఎస్ఎస్ పనుల నేపథ్యంలో ఉదయం10 గంటల నుంచి 2 గంటల వరకు పరిసరాల్లో విద్యుత్ ఉండదన్నారు. దీంతో కళ్యాణ్ నగర్, ఆదర్శనగర్, జంగాల కాలనీ, ఉద్యోగుల కాలనీ, ఫోర్త్ బ్రిడ్జి, సాయిరాం కాలనీ, బొమ్మన కాలనీ, కోలమూరు, రాయుడు పాకలలో విద్యుత్ నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.
కృష్ణా: కంకిపాడు మండలం ఈడుపుగల్లు గ్రామంలో రూ.3 కోట్ల 50 లక్షల నిధులతో ఈడుపుగల్లు నుంచి ఉప్పులూరు వరకు ఏడు మీటర్ల వెడల్పుతో నిర్మించిన తారు రోడ్డును ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న ఈ రహదారి నిర్మాణం పూర్తి చేసినందుకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.
SKLM: ఇచ్ఛాపురం మండల ఈదుపురంలో శిర్డీ సాయి ఆలయ 15వ వార్షికోత్సవాన్ని ఇవాళ ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త ఉలాసి గోపాలరెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఇవాళ ప్రత్యేక హారతి, నారాయణ సేవ తదితర ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
E.G: సీతానగరం గ్రామ దేవత శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి స్థానిక మహిళలు గురువారం 108 రకాల పిండి వంటలతో సారెను సమర్పించి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఉగాది సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ సంప్రదాయం కొనసాగుతుందని గ్రామస్థులు తెలిపారు. గరగ నృత్యాలు బాణసంచా కాల్పులతో సారెను గ్రామంలో ఊరేగించి, ఆలయానికి చేరుకున్నారు. కార్యక్రమంలో సుమారు 900 మంది మహిళలు పాల్గొన్నారు.