ప్రతి ఏటా దసరా వస్తే చాలు..రెండు వర్గాలు కర్రలతో ఒకరిపై ఒకరు తెగ కొట్టుకుంటారు. ఈ వేడుకకు పోలీసులు కూడా అనుమతి ఇవ్వడం విశేషం. అదేంటీ అనుకుంటున్నారా..అవును మీరు విన్నది నిజమే. ఏపీ కర్నూల్ జిల్లా దేవరగట్టులో ప్రతి సంవత్సరం దసరా రోజున బన్ని ఉత్సవం పేరుతో ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. శ్రీమాళ మల్లేశ్వర స్వామి ఆలయం దగ్గర ఈ ఉత్సవం జరుపుతున్నారు.
ఈ ఏడాది కూడా వారి సంప్రదాయం ప్రకారం నిర్వహించిన కర్రల సాములో 70 మందికిపైగా గాయాలయ్యాయి. వారిలో ఆరుగిరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ వేడుకలో దేవరగట్టు గ్రామ ప్రజలతోసహా చుట్టుపక్కల 10 గ్రామాల ప్రజలు పాల్గొన్నట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. స్వామివారి భవిష్యవాణి తర్వాత కర్రల సాము కార్యక్రమం పూర్తైంది. ఈ ఉత్సవాల్లో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనడంతో ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈసారి ప్రాణనష్టం జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.