ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజు రోజుకీ రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నా… ఇప్పటి నుంచే అన్ని పార్టీలు రాజకీయాలపై పూర్తి దృష్టి పెడుతున్నాయి. కాగా.. తాజాగా.. వచ్చే ఎన్నికల పై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు క్లారిటీ ఇచ్చారు. ఆయన గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచినా.. ఆ పార్టీకి వ్యతిరేకంగా మారారు. దీంతో… వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు అనే విషయం ఆసక్తికరంగా మారింది. తాజాగా ఆయన కూడా…. ఓ మీడియా ఛానెల్ తో మాట్లాడుతూ ఆ విషయంపై క్లారిటీ ఇవ్వడం గమనార్హం.
వైఎస్సార్సీపీ వాళ్లు తనకు టికెట్ ఇస్తానన్నా తాను టికెట్ తీసుకోను అన్నారు రఘురామ. మరి వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఈ పార్టీకి ఏదైతే ప్రధాన ప్రతిపక్ష కూటమి ఉంటుందో ఆ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తానని క్లారిటీ ఇచ్చారు. ఆ కూటమిలో రెండు పార్టీలు కచ్చితంగా ఉంటాయని జోస్యం చెప్పారు. మూడు పార్టీలు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయని.. కానీ రెండు ప్రధాన పార్టీలు కూటమిలో పక్కాగా ఉంటాయని తేల్చి చెప్పారు.
ఇప్పటికే రాష్ట్రంలో ప్రజలకు దీనిపై క్లారిటీ ఉందన్నారు రఘురామ. ముసుగులో గుద్దులాట ఎందుకు.. ఓపెన్‌గా చెబుతున్నానని.. కచ్చితంగా మూడు పార్టీలు ఉంటాయని తన నమ్మకమని.. కొంతమంది చోటా మోటా నేతలు కామెంట్లు చేసినా సరే.. కచ్చితంగా మూడు పార్టీల మధ్య పొత్తు ఉంటుందన్న నమ్మకం తనకు ఉందన్నారు. కొంతమంది ఈ మూడు పార్టీలు ఉండవంటున్నారని.. కొందరు ఈ మూడు కాదు మా రెండే ఉంటాయని అంటున్నారని.. మిగిలిన ఇద్దరు ఏమీ మాట్లాడటం లేదన్నారు. ఓటు చీలనివ్వమని ఒకరు అంటున్నారు.. ఏమీ మాట్లాడకుండా చాప కింద నీరులా ఓ పార్టీకి తండోపతండాలుగా జనాలు వస్తున్నారన్నారు.
రెండు పార్టీలు కలవడం వల్ల తప్పేం లేదన్నారు రఘురామ. ఈ రెండు పార్టీలు కలిస్తే.. ఒకరు వీక్, ఒకరు స్ట్రాంగ్ అనుకోవడం తప్పని వ్యాఖ్యానించారు. అందుకే ఎన్ని పోటీ చేస్తావ్ అంటూ కావాలనే రెచ్చగొడుతున్నారని.. దాని వల్ల ఉపయోగం ఉండదన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రజల్లో ఐక్యతా భావం వచ్చిందని.. ప్రజల్లో ఐక్యతా భావం వచ్చాక నాయకులు కలవకపోతే ప్రజలకు ఇబ్బంది లేదు నాయకులు ఇబ్బందిపడతారన్నారు.