జనసేనాని పవన్ పై వైసీపీ నేతలు ఒకరి తర్వాత మరొకరు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. యువశక్తి సభలో పవన్ ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడంతో.. వైసీపీ నేతలు విమర్శలకు ప్రతి దాడి చేయడం మొదలుపెట్టారు. పవన్ హవాలా డబ్బులతో దొరికిపోయాడని మంత్రి దాడిశెట్టి రాజా ఆరోపించారు. పవన్ ఆరాటం మొత్తం చంద్రబాబు కోసమేనని ఆయన అన్నారు. కాపులను పవన్ కల్యాణ్ తన యజమాని చంద్రబాబుకు అప్పగించాడన్నారు. ఇలాంటి శునకాలు చంద్రబాబు వద్ద చాలానే ఉన్నాయి అంటూ ఘాటు వ్యాఖలు చేశారు. వైఎస్సార్ ను సైతం డీ కొట్టానని అంటున్న పవన్ కు ఆయన పేరెత్తే అర్హత లేదని, గతంలో వైఎస్సార్ దెబ్బకు ప్రజారాజ్యం తుడిచిపెట్టుకుపోయిందని గుర్తు చేశారు. ఇప్పుడు సీఎం జగన్ దెబ్బకు జనసేన పార్టీకి కూడా అదే గతి పట్టడం ఖాయమని అన్నారు మంత్రి దాడిశెట్టి.
పవన్ కల్యాణ్ రూ.1,800 కోట్లు పోలెండ్ కు హవాలా చేస్తూ కేంద్రానికి దొరికిపోయాడని దాడిశెట్టి రాజా సంచలన ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు కేంద్రం వద్ద ఉన్నాయంటూ రెండు మూడు నెలల నుంచి ప్రచారం జరుగుతోందని ఆయన అన్నారు. భీమ్లానాయక్ సినిమాను ఏపీ ప్రభుత్వం అడ్డుకోవడం వల్ల రూ.30 కోట్లు పోయాయి అని పవన్ అంటున్నారు. ఆ సినిమా ప్రొడక్షన్ ఖర్చులే రూ.20 కోట్లు దాటకపోతే, రూ.30 కోట్ల నష్టం ఎలా వస్తుంది అని మంత్రి ప్రశ్నించారు. నాసిరకం సినిమా ప్రజలు చూడకపోతే, అందుకు ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించిన రాజా తక్కువ బడ్జెట్ లో వచ్చిన కాంతార ఏ విధంగా హిట్టయ్యిందో అందరూ చూశారని పేర్కొన్నారు.