ఆంధ్రప్రదేశ్లో మరో 24 గంటల్లో భారీ వర్షాలు కురనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. రెండు మూడు రోజులుగా ఏపీలో వర్షాలు పడుతూనే ఉన్నాయి. బంగాళాఖాతంలో ద్రోణుల ప్రభావంతో చెదురుముదురు వానలు పడుతున్నాయి. రేపు ఎన్టీఆర్ జిల్లా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
రాష్ట్రంలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల శాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది.
రాబోవు 24 గంటల్లో ఉత్తర అండమాన్, దానిని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, అది క్రమంగా బలపడి పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఒకవేళ ఆ అల్పపీడనం ఏర్పడితే ఏపీలో భారీ వర్షాలు పడనున్నట్లు వెల్లడించింది.