స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు (Skill Developement scam case)లో టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ (CID) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగా ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఆయన అరెస్ట్‌కు సంబంధించి రోజుకో మలుపు చోటుచేసుకుంటోంది. చంద్రబాబుకు బెయిల్ ఎంతకీ రాకపోవడంతో టీడీపీ అభిమానులు నిరాశలో ఉన్నారు. చంద్రబాబు ఇప్పట్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా మరో కీలక విషయం చర్చనీయాంశమైంది.
ఈ స్కామ్ కేసులో బ్రాహ్మణి (Brahmani), భువనేశ్వరి (Bhuvaneswari), బాలకృష్ణ (Balakrishna)లపై కూడా కేసులు నమోదయ్యే అవకాశం ఉందని పలువురు చర్చించుకుంటున్నారు. ఏపీ మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి (MLA Anam Ramanarayana Reddy) దీనిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. స్కిల్ స్కామ్ లో నారా లోకేశ్‌తో పాటుగా బ్రాహ్మణి, భువనేశ్వరి, బాలకృష్ణ పేర్లను చేర్చి సీఐడీ మెమో ఫైల్ చేసినట్లుగా తమకు సమాచారం అందినట్లు వెల్లడించారు.
దీనిపై తమ న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నామని, ఈ విషయంలో ప్రభుత్వంతో ఎలా పోరాడాలనే దానిపై కార్యాచరణను రూపొందిస్తున్నామని ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. దీంతో త్వరలోనే లోకేశ్, భువనేశ్వరి, బ్రాహ్మణిలు కూడా జైలుకు వెళ్లే ఛాన్స్ ఉందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ కేసులో లోకేశ్ (Nara Lokesh) పేరును ఇప్పటికే చేర్చగా ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉన్నారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో హెరిటేజ్ ఫుడ్స్ (Heritage Foods) సంస్థకు భారీగా లబ్ది చేకూరిందనే అనుమానాలు ఉన్నట్లు సీఐడీ భావిస్తోందని, ఆ ఆరోపణలు నిజమని తేలితే భువనేశ్వరి, బ్రహ్మణిలు కూడా జైలుకు వెళ్లే అవకాశం కచ్చితంగా ఉంటుందని ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. హెరిటేజ్ ఫుడ్స్ సంస్థకు లబ్ది చేకూరే విధంగా అప్పట్లో టీడీపీ (TDP) వ్యవహరించిందని, అందుకే అప్పటి ఆ సంస్థ మేనేజ్మెంట్ హోదాలో ఉన్న భువనేశ్వరి, బ్రాహ్మణిలకు ఇబ్బందులు తప్పవని సోషల్ మీడియాలో కామెంట్స్ వ్యక్తమవుతున్నాయి.