అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో A14గా నారాలోకేశ్ పేరును నమోదు చేసింది. దీంతో నారా లోకేశ్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. తన తండ్రిని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని చెబుతూ ఆయన జాతీయ మీడియా ద్వారా తన సందేశాన్ని వినిపిస్తున్నారు. యువగళం పాదయాత్రను ఎల్లుండి నుంచి ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు (Amaravati Inner Ring Road)లో సీఐడీ (CID) అధికారులు నారా లోకేశ్ (Nara Lokesh)ను A14గా నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు మెమోను దాఖలు చేశారు. దీంతో నారా లోకేశ్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. తన తండ్రి చంద్రబాబు అరెస్ట్ తర్వాత యువగళం పాదయాత్రకు లోకేశ్ తాత్కాలికంగా విరామం ఇచ్చారు. ఆ తర్వాత ఏపీలో జరిగిన పలు కీలక పరిణామాలతో ఢిల్లీకి వెళ్లి పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు.
చంద్రబాబు (Chandrababu) క్వాష్ పిటీషన్‌పై న్యాయవాదులతో లోకేశ్ చర్చలు జరుపుతూనే మరో వైపు చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారనే అంశాలపై జాతీయ మీడియా దృష్టికి తీసుకెళ్లారు. అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా కలిసి టీడీపీ ఎంపీలతో పాటు ఆమెకు వినతిపత్రం అందించారు.
ఈ సందర్భంగా నారా లోకేశ్ మీడియాతో మాట్లాడుతూ..అసలు వేయని రోడ్డు విషయంలో తనపై కేసు పెట్టారన్నారు. తనకు సంబంధం లేని శాఖ అయినా తనపై కేసు పెట్టడం ఏంటని మండిపడ్డారు. తాను యువగళం పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తానని తెలిసి ఆ యాత్రను ఆపే కుట్ర చేస్తున్నారన్నారు. ఎన్ని అక్రమ కేసులు తనపై పెట్టినా పాదయాత్ర చేపట్టి తీరుతానని అన్నారు.