ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. స్కిల్ డెవలప్మెంట్ (Skill development) కేసులో చంద్రబాబు అరెస్టుకు సంబంధించి పలు పిటిషన్లపై ఇవాళ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు(Supreme Court)తో పాటు విజయవాడ సీఐడీ కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమయింది. జస్టిస్ సంజయ్ (Justice Sanjay) ఖన్నా, జస్టిస్ ఎస్వీ భట్టిలు పిటిషన్ పై విచారణ చేపట్టారు. అయితే లంచ్ టైం కావడంతో విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత విచారణ తిరిగి ప్రారంభం కానుంది.
చంద్రబాబు తరపున సిద్ధార్థ్ లూథ్రా(Siddharth Luthra), హరీశ్ సాల్వేలు వాదనలు వినిపిస్తున్నారు. రేపటి నుంచి సుప్రీంకోర్టుకు సెలవులు ఉన్న నేపథ్యంలో, సుప్రీంకోర్టు చంద్రబాబు (Chandrababu) పిటిషన్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ సర్వత్ర నెలకొంది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఎ కింద గవర్నర్ (Governor) నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు వ్యవహారంలో తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దాఖలుచేసిన ఎస్ఎల్పీ సుప్రీంకోర్టు విచారణ చేయున్నది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్ల నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఐటం 61 కింద ఈ కేసు లిస్ట్ అయింది. తనపై నమోదైన కేసును కొట్టేయాలని కోరుతూ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను తిరస్కరిస్తూ గత శుక్రవారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి (Srinivasa Reddy) ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.