దళితుడి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అనంతబాబు(Anantha Babu)ను ఎమ్మెల్యేల మీటింగ్లో కూర్చోబెట్టడమేంటని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల (MLA Gorantla) బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. పార్టీ నుండి సస్పెండ్ చేశామని ప్రకటన చేసిన వైసీపీ (YCP) ఇప్పుడు ఎమ్మెల్యేల మీటింగ్ లో ఆయనను ఎలా కూర్చోబెట్టిందని ప్రశ్నించారు. ఈమేరకు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్వీట్ చేశారు. తన మాజీ డ్రైవర్ మరణానికి కారణం తానేనంటూ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చిన వ్యక్తిని మీటింగ్ లో కూర్చోబెట్టడానికి సిగ్గుందా జగన్? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు కడియంలో జరిగిన రిలే నిరాహార దీక్ష శిబిరం వద్ద బుచ్చయ్య చౌదరి మాట్లాడారు. చంద్రబాబు (Chandrababu) అరెస్టు అక్రమమని, ఆయనను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
స్కిల్ డెవలప్ మెంట్ (Skill development) కార్పొరేషన్ తో ముడిపడిన అనేక ప్రధాన అంశాలను పక్కన పెట్టిన అధికారులు ఒక అధికారి నోట్ ఫైల్ లో రాసిన అంశాన్ని అనుకూలంగా మలుచుకున్నారని ఆరోపించారు. దీనిని ఆధారంగా చూపిస్తూ చంద్రబాబును అరెస్టు చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. ఎటువంటి అవినీతికి పాల్పడని చంద్రబాబు కడిగిన ముత్యంలా జైలు నుంచి బయటకు వస్తారని బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. మే 25న పార్టీ నుంచి సస్పెండ్ (Suspend) చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే బెయిల్పై విడుదలైన అనంతబాబు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఈనెల 26న తాడేపల్లిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు ఎమ్మెల్సీ అనంతబాబు హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది. సమీక్షలోఅనంతబాబు పాల్గొన్న ఫోటోలు రిలీజ్ అయ్యాయి. దీంతో వైసీపీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి