స్కిల్ డెవలప్ మెంట్ కేసు (Skill Developement Case)లో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)కి సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. బాబు వేసిన క్వాష్ పిటిషన్‌ను సుప్రీం అక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేస్తూ ప్రకటించింది. రేపటి నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు సుప్రీంకోర్టుకు వరుస సెలవులు ఉండటంతో ధర్మాసనం ఈ కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు తరపున సిద్ధార్థ్ లూథ్రా తన వాదనలు వినిపించినప్పటికీ లాభం లేకుండా పోయింది.
ఈ పిటిషన్‌కు మొదట జస్టిస్ సంజయ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీ భట్టి ధర్మాసనం ముందుకు రాగా విచారణ నుంచి జస్టిన్ ఎస్వీ భట్టి తప్పుకున్నారు. పిటీషన్‌ను త్వరగా లిస్ట్ చేయాలనేది మొదటి అభ్యర్థగా, చంద్రబాబుకు బెయిల్ అనేది రెండో అభ్యర్థనగా లూథ్రా కోర్టుకు విన్నవించారు. చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలనేది తాము కోరడం లేదని, అయితే పోలీసు కస్టడీ నుంచి మినహాయింపు ఇవ్వాలని లూథ్రా కోరారు.
చంద్రబాబు లాయర్ సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తుండగా ప్రభుత్వం తరపు న్యాయవాది రంజిత్ కుమార్ కల్పించుకుని వ్యతిరేకించారు. అయినప్పటికీ కోర్టు లూథ్రా వాదనలను పూర్తిగా వింది. ఎన్నికలు వస్తున్న తరుణంలో వరుస కేసులు వేస్తున్నారని, వెంటనే చంద్రబాబుకు ఉపశమనం కలిగించాలని లూథ్రా బలంగా వాదించారు. ఆఖరికి ఇరువైపుల వాదనలు విన్న సీజేఐ డీవై చంద్రచూడ్ కోర్టుకు సెలవులు ఉన్న నేపథ్యంలో 3వ తేదీకి కేసును వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో వచ్చే మంగళవారం వాదనలు కొనసాగనున్నాయి.