ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎస్( ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి) గా.. జవహర్ రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం సీఎస్ గా ఉన్న సమీర్ శర్మ… పదవీ కాలం ముగిసింది. ఆయన బుధవారం పదవీ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానంలో జవహర్ రెడ్డికి ఈ పదవి కట్టపెట్టారు. ఈ మేరకు ఆయన నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన జవహర్ రెడ్డి… ప్రస్తుతం ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన జవహర్ రెడ్డి… ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవోగా బదిలీ అయ్యారు. అంతకుముందు పలు కీలక శాఖల్లోనూ ఆయన పని చేశారు.
ప్రస్తుత సీఎస్ సమీర్ శర్మ రేపు (నవంబర్ 30) పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో ఏపీకి తదుపరి సీఎస్ గా ఎవరు నియమితులవుతారన్న విషయంపై గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది. చాలా మంది సీనియర్లు ఈ పదవి దక్కుతుందని ఆశపడినట్లు సమాచారం.
అయితే.. సీఎస్ గా జవహర్ రెడ్డికే అవకాశం దక్కుతుందన్న వాదనలు గట్టిగానే వినిపించాయి. తాజాగా ప్రభుత్వం కూడా జవహర్ రెడ్డి వైపే మొగ్గు చూపుతూ సీఎస్ గా ఆయనను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సమీర్ శర్మ పదవీ విరమణ చేయగానే… జవహర్ రెడ్డి సీఎస్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు.