ఎన్టీఆర్ అంటే చంద్రబాబు కన్నా.. తనకే ఎక్కువ గౌరవం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా.. ఏపీ ప్రభుత్వం…ఎన్టీఆర్ వర్శిటీ పేరును మారుస్తున్నట్లు ప్రకటించింది. దీంతో… జగన్ తీసుకున్న నిర్ణయంపై టీడీపీ నేతలు ఖండిస్తూ.. ఆందోళనకు దిగారు. స్పీకర్ వెల్ లోకి వెళ్లి ప్రభుత్వ తీరును ఖండించారు. పలుమార్లు సభను వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభంకాగా… టీడీపీ సభ్యులు తమ నిరసనను కొనసాగించారు. దీంతో స్పీకర్ పై టీడీపీ సభ్యులు బిల్లు పేపర్లు వేశారు. ఈ క్రమంలో టీడీపీ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేశారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ… చంద్రబాబుపై కౌంటర్ల వర్షం కురిపించారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని సీఎం జగన్ ఆరోపించారు. బిల్లుపై మాట్లాడిన సీఎం జగన్… ఎన్టీఆర్ కు చంద్రబాబు భారతరత్న ఎందుకు ఇప్పించలేకపోయారని ప్రశ్నించారు. ఎన్టీఆర్ అంటే తమకు గౌరవం ఉందని… ఏరోజు ఒక మాట అనలేదని గుర్తు చేశారు. తన పాదయాత్రలో కూడా ఓ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడుతామని చెప్పామని… అదే విధంగా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అన్ని ఆలోచించే పేరు మార్పుపై నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.
‘కేంద్రంలో పలుమార్లు భాగస్వామిగా ఉన్న చంద్రబాబు ఎన్టీఆర్ కు ఎందుకు భారతరత్న ఎందుకు ఇప్పించలేకపోయారు..? ఎన్టీఆర్ కు వెన్నుపోటును రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు. ఎన్టీఆర్ మరణానికి కారకులైన వారు వర్శిటీ పేరు మార్పుపై నినాదాలు చేస్తున్నారు. ఇది చాలా దారుణం. కేంద్రంలో చక్రం తిప్పానని చాలాసార్లు చంద్రబాబు చెప్పారు. కానీ ఎన్టీఆర్ కు భారతరత్న ఇప్పించలేదు..? దీనికి కారణాలు కూడా చెప్పరు. అధికారంలో లేనప్పుడు మాత్రమే చంద్రబాబుకు ఎన్టీఆర్ గుర్తుకువస్తారు. రామోజీరావు లాంటి వ్యక్తులకు అవార్డులు ఇప్పించారు. ఇలా డ్రామాలు ఆడే వ్యక్తుల మధ్య రాజకీయాల్లో చిత్తశుద్ధి అనేది లేకుండా పోయింది. సభలో ప్రవేశపెట్టిన పేరు మార్పు బిల్లుపై చాలా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాం. నాకు నేను కూడా ప్రశ్నించుకున్నాను. ఇవాళ రాష్ట్రంలో అమలవుతున్న 104, 108 వంటి పథకాలకు సృష్టికర్త వైఎస్ రాజశేఖర్ రెడ్డి. చదువురీత్యా కూడా డాక్టర్. పులివెందులలో వైద్య సేవలు అందించి రాజకీయాల్లోకి వచ్చారని’ అని గుర్తు చేశారు.
రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజీలు ఉంటే ఇందులో టీడీపీ స్థాపించకముందే 8 కాలేజీలను నిర్మించారని జగన్ గుర్తు చేశారు. ఆ తర్వాత వచ్చిన 3 కాలేజీలు వైఎస్ఆర్ తీసుకువచ్చారని స్పష్టం చేశారు. అసలు టీడీపీ ప్రభుత్వం…ఏం చేసిందని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చాకా కొత్తగా 17 మెడికల్ కాలేజీలు కడుతున్నామని తెలిపారు. మొత్తంగా 28 మెడికల్ కాలేజీలు కాలేజీలు వైఎస్ పాలన లేదా ఆయన కుమారుడు పెట్టిన పార్టీ ఆధ్వర్యంలో కడుతున్నవే కదా గుర్తు చేశారు. క్రెడిట్ ఇవ్వాల్సిన వ్యక్తికే ఇవ్వాలి కదా అని వ్యాఖ్యానించారు. అందుకే ఆరోగ్య వర్శిటీకి ఎన్టీఆర్ పేరు పెడుతున్నామని చెప్పారు. ఎన్టీఆర్ ను గౌరవిస్తున్నామని… ఆయనంటే తమకు ఎలాంటి కల్మషం లేదన్నారు. ఆయన గొప్ప వ్యక్తి అని… ఎవరూ అడకపోయిన విజయవాడ జిల్లాకు పేరు పెట్టామన్నారు. టీడీపీ హయాంలో ఏమైనా కట్టి ఉంటే… ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే ఆయన పేరు పెట్టే విధంగా చూస్తామని చెప్పారు.