»Gold Mines In Those Three Districts Of Ap Excavation Soon
NMDC: ఏపీలోని ఆ మూడు జిల్లాల్లో బంగారు గనులు..త్వరలోనే తవ్వకాలు!
ఏపీలో మరో మూడు గనుల్లో బంగారం తవ్వకాల కోసం ఎన్ఎండీసీ దరఖాస్తు చేసుకుంది. కర్నూలు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో బంగారం గనుల తవ్వకాల కోసం దాదాపు రూ.500 కోట్లను ఎన్ఎండీసీ సంస్థ పెట్టుబడి పెట్టనుంది.
ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh)లో బంగారం (Gold), ఖనిజాల తవ్వకాల కోసం గనులు కేటాయించాలని ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎండీసీ (National Mineral Development Corporation) దరఖాస్తు చేసుకుంది. నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాలో గనులు ఉన్నాయని ఆ సంస్థ గుర్తించింది. కర్నూలు, అనంతపురం జిల్లాలోని పెరవలి, బేతపల్లితో పాటు చిత్తూరు జిల్లాలోని రాజగొల్లపల్లి, నెల్లూరులోని కోనేటిరాజుపాలెం గనుల బ్లాకులను కేటాయించాలని ఎన్ఎండీసీ కోరింది.
ఆ గనుల్లో బంగారం (Gold)తో పాటుగా ఇతర ఖనిజాలను కూడా తవ్వుకునే అవకాశం ఇవ్వాలని కోరింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వంతో ఎన్ఎండీసీ (NMDC) సంప్రదింపులు జరుపుతోంది. ఇప్పటికే మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో బంగారం (Gold), వజ్రాల గనుల్ని నిర్వహిస్తూ వస్తోంది. తాజాగా ఏపీలో కూడా గనులు తవ్వేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఏపీలోని చిత్తూరు జిల్లాలో చిగర్గుంట-బైసంతానం గనిలో తవ్వకాలు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి రూ.2.48 కోట్లను, రూ.12.39 కోట్లకు బ్యాంకు గ్యారెంటీలను అందించింది. త్వరలోనే ఈ ప్రాంతంలో తవ్వకాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పుడు నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాలో కొత్తగా గనులను దక్కించుకునేందుకు ఎన్ఎండీసీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ బంగారు గనుల తవ్వకాల కోసం దాదాపుగా రూ.500 కోట్లను పెట్టుబడి పెట్టాలని చూస్తోంది.
ఇకపోతే చిత్తూరు జిల్లాలోని గనిలో 1.83 మిలియన్ టన్నుల ఖనిజం ఉన్నట్లుగా ఎన్ఎండీసీ అంచనా చేసింది. ప్రతి టన్నుకూ 5.15 గ్రాముల బంగారం ఉన్నట్లుగా ఎన్ఎండీసీ అంచనా వేస్తోంది. త్వరలోనే ఈ ప్రాంతాల్లో తవ్వకాలు చేపట్టనుంది. బంగారంతో పాటుగా ఇనుప ఖనిజాన్ని కూడా ఉత్పత్తి చేయనుంది.