Chegondi Suryaprakash: జనసేన పార్టీకి గట్టి షాక్ తగిలింది. చేగొండి సూర్యప్రకాష్ పార్టీని వీడారు. ఆయన కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య తనయుడు. జనసేన పార్టీలో క్రియాశీల సభ్యుడిగా జనసేన పొలిటికల్ ఎఫైర్స్ సభ్యుడిగా కీలకంగా వ్యవహరించిన సూర్యప్రకాష్, పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కలిసి చేస్తున్న పొత్తు రాజకీయంతో విబేధించినందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం తాడేపల్లిలోని సీఎం కార్యాలయానికి వచ్చిన ఆయన.. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జనసేనాని తీరుపై తీవ్రంగా మండిపడ్డారు.
జనసేన పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని, వాక్ స్వాతంత్య్రం లేదని చేగొండి సూర్య ప్రకాష్ అన్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీని నడపలేని అసమర్థుడని, తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ కొమ్ము కాస్తున్నాడని అన్నారు. చంద్రబాబు, లోకేష్‌లను సీఎం చేయాలని పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నారు. 100 నియోజకవర్గాల్లో కనీసం ఇన్ ఛార్జిని కూడా నియమించలేదు. జనసేన పార్టీని నాదెండ్ల మనోహర్ అనే వ్యక్తి చేతిలో పెట్టారని పవన్ కళ్యాణ్ విమర్శించారు. జనసేన పార్టీ నమ్ముకున్న బడుగు బలహీన వర్గాలను ముంచేసే ప్రయత్నం ఆయన చేస్తున్నారని విమర్శించారు. ఆరేళ్లలో తనతో కేవలం 30 నిమిషాలు మాత్రమే మాట్లాడారన్నారు. ఆరు ఏళ్లుగా జనసేన పార్టీ కోసం పని చేశానన్నారు. స్టేజ్ పై కేవలం ముగ్గురు మాత్రమే కూర్చుని ఉంటారని.. ఎవరైనా ఎదురు ప్రశ్నిస్తే వైసీపీ కోవర్టులని పవన్ ముద్ర వేస్తారన్నారు. మనసు చంపుకుని జనసేనలో ఉండలేక… బయటికి వచ్చానన్నారు. జగన్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉందన్నారు. వైసీపీకి, జగన్ కు ఏమి ఆశించకుండా చేదోడువాదోడుగా ఉంటానన్నారు. బేషరతుగా వైసీపీ పార్టీలో చేరానన్నారు.