Pawan Kalyan: మట్టి గణపతిని పూజిద్దాం.. పవన్ కల్యాణ్
వినాయక చవితి పండుగ త్వరలో రానుంది. ఈ సందర్భంగా అందరూ మట్టి గణపతినే పూజించాలని జనసేన అధినేత, ఏపీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ హితవుపలికారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
Pawan Kalyan: వినాయక చవితి పండుగ త్వరలో రానుంది. ఈ సందర్భంగా అందరూ మట్టి గణపతినే పూజించాలని జనసేన అధినేత, ఏపీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ హితవుపలికారు. పర్యావరణ ప్రేమికుడు, ప్రకృతి వ్యవసాయ నిపుణుడు విజయ్ రామ్ ఈ రోజు పవన్ కల్యాణ్‌ను కలిశారు. ఈ మేరకు మంగళగిరిలోని పవన్ నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా మంత్రితో కర్చొని పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా పర్యావరణం, ప్రకృతి గురించి మాట్లాడారు. అనంతరం మంత్రి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. త్వరలోనే వినాయక చవితి పండుగ రాబోతుంది, కావునా అందరూ మట్టి గణపతి పెట్టి ఆరాధించాలి అని సూచించారు. భక్తితో పాటు పర్యావరణానికి కూడా ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. దీని ద్వారా, జల, వాయు కాలుష్యాలను అరికట్టవచ్చన్నారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
ఆయన నియోజకవర్గం అయినా పిఠాపురంలో అందరూ మట్టితో తయారుచేసిన ప్రతిమలనే పూజించేలా చూస్తానని, అందుకే తగిన ప్రచార బాధ్యతలు తీసుకుంటా అని చెప్పారు. అలాగే దేవాలయాల్లో ప్రసాదాలను బటర్ పేపర్‌తో చేసిన కవర్లు వాడుతున్నారని, దానికి బదులు తాటాకు బట్టలు, ఆకులతో చేసిన దొన్నెలు వాడాలని సూచించారు. ఈ ప్రయోగాన్ని సైతం పిఠాపురం నుంచే మొదలుపెడుతున్నట్లు చెప్పారు. ప్రకృతి వ్యవసాయ నిపుణుడు విజయ్ రామ్‌ను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని పవన్ కల్యాణ్ అన్నారు. ముఖ్యంగా వ్యవసాయంలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించాలన్నారు.