»Clash In Jana Sena And Tdp Atmiya Sabha Argument Between Two Factions
Ap Politics: జనసేన, టీడీపీ ఆత్మీయ సభలో ఘర్షణ..రెండు వర్గాల మధ్య వాగ్వాదం
పిఠాపురంలో టీడీపీ, జనసేన నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. చిన్న గొడవలో మాటమాట పెరగడంతో వాగ్వాదం తలెత్తి ఘర్షణకు దారి తీసింది.
అనకాపల్లిలో జరుగుతున్న జనసేన, టీడీపీ ఆత్మీయ సభలో (Janasena-TDP) వాగ్వాదం చోటుచేసుకుంది. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని పరచూరి భాస్కరరావు వర్గంపై దూలం గోపి వర్గం ఘర్షణకు దిగింది. తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం (Pithapuram) నియోజకవర్గ సమన్వయ సమావేశంలో ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. రెండు పార్టీల నేతలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. దీంతో చిన్న గొడవ కాస్తా కుర్చీలతో కొట్టుకునే వరకూ వెళ్లింది.
రెండు పార్టీల మధ్య ఇలాంటి గొడవలు తలెత్తుతాయని మొదట్నుంచీ అందరూ అనుకుంటూ వస్తున్నారు. చంద్రబాబు (Chandrababu), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మధ్య సమన్వయం కుదిరితే సరిపోదని, కిందిస్థాయి కార్యకర్తల మధ్య ఆ సమన్వయం ఉంటేనే వైసీపీకి గట్టి పోటీని ఇవ్వగలవని మరికొందరు చర్చించుకుంటున్నారు. జనసేన, టీడీపీ పార్టీలు పోటీకి దిగుతున్న నియోజకవర్గాలు 40 వరకూ ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలి.
రెండు పార్టీల కార్యకర్తలు ఘర్షణకు దిగడంతో ఏపీలో పొలిటికల్ హీట్ (Ap Politics) మరింత వేడెక్కింది. పిఠాపురంలో రెండు వైపుల కార్యకర్తలు రెచ్చిపోయారు. కుర్చీలతో కొట్టుకున్నారు. ఆత్మీయ సభలో టీడీపీ ఇన్ఛార్జీ వర్మ మాట్లాడుతూ..తాను నియోజకవర్గాన్ని రూ.2800 కోట్లతో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఆ సమయంలో జనసేన ఇన్ఛార్జి ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ..నిజంగానే నియోజకవర్గాన్ని అంతలా అభివృద్ధి చేసుంటే ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారు.
రాబోయే ఎన్నికల్లో జనసేన గెలుపు కోసం టీడీపీ సాయం చేయాలని ఉదయ్ శ్రీనివాస్ కోరారు. దాంతో వర్మ మాటలతో రెచ్చిపోయారు. మహామహులే ఎన్నికల్లో ఓడిపోయారని, పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయిన విషయాన్ని గుర్తు చేస్తూ సెటైర్లు వేశారు. దీంతో జనసేన నేతలకు ఆగ్రహం పెరిగి వాగ్వాదానికి దిగారు. ఇరు పార్టీ నేతల మధ్య మాటమాట పెరిగింది. కుర్చులు విసిరేసుకున్నారు. ప్రస్తుతం టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణ ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్ అయ్యింది.