»Danger Bells In Visakha Air Quality Has Suddenly Dropped
Visakhapatnam: విశాఖలో డేంజర్ బెల్స్..ఒక్కసారిగా పడిపోయిన గాలి నాణ్యత
విశాఖలో గాలి నాణ్యత బాగా పడిపోయింది. పరిశ్రమల నుంచి వచ్చే పొగ వల్ల గాలి కాలుష్యం తీవ్రం ఏర్పడింది. అదే సమయంలో దీపావళి పండగ కూడా రావడంతో కాలుష్యం మరికాస్తా ఎక్కువైంది. దీంతో కేంద్ర కాలుష్య నివారణ సంస్థ కీలక ప్రకటన చేసింది. విశాఖ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
దేశంలోనే అత్యంత సుందర నగరాల్లో విశాఖపట్నం (Visakhapatnam) కూడా ఒకటి. పొడవైన తీర ప్రాంతంతో ఉండే ఈ ప్రాంతం పచ్చని కొండలతో అందంగా కనిపిస్తుంటుంది. అటుంటి నగరాన్ని కాలుష్యం (Pollution) కమ్మేసింది. ప్రస్తుతం విశాఖపట్నం అత్యంత కాలుష్య నగరాల జాబితాలోకి చేరడంతో పర్యాటకులు ఆందోళన చెందుతున్నారు. వైజాగ్ పోర్ట్, ఫార్మా కంపెనీలు, ఇతర పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం నగరాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
మరోవైపు దీపావళి (Diwali) రావడంతో కాల్చిన క్రాకర్స్ కారణంగా ఆ కాలుష్యం మరికాస్త పెరిగింది. నగరం మొత్తం గాలి కాలుష్యం (Air Pollution) కమ్మేయడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా విశాఖలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (Air Quality Index) ప్రమాదకర స్థాయికి చేరింది. దీపావళి తర్వాత 245 నగరాలు, పట్టణాల్లో గాలి నాణ్యతను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పరిశీలించింది. ఆ సమయంలో అధికారులకు దిమ్మతిరిగే వాస్తవాలు తెలిశాయి.
దేశంలోని మొత్తం 53 నగరాలు, పట్టణాల్లో ప్రమాదకర స్థాయిలో గాలి నాణ్యత ఉందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లోని 8 నగరాలు, పట్టణాల్లో శాంపిళ్లను సీపీసీబీ సేకరించి పరిశీలించింది. అందులో అత్యధికంగా చిత్తూరులో 348 పాయింట్లు ఉండగా విశాఖలో ఏక్యూఐ 308గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. సాధారణంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 51 నుంచి 100 వరకూ ఉంటే సంతృప్తిగా ఉందని, 201 నుంచి 300 వరకూ ఉంటే పూర్ అని, 301 నుంచి 400 వరకూ అయితే వెరీ పూర్ అని, 401 నుంచి 500 వరకూ ఉంటే తీవ్ర ఆందోళనకరం అని అధికారులు పరిగణిస్తారు.
ఇప్పుడు విశాఖ (Vizag)లో ఏక్యూఐ 348గా నమోదు అవ్వడంతో వెరీ పూర్ కేటగిరీలోకి (Very Poor Categiry) చేరింది. ఈ తరహా కాలుష్యం (Pollution) వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఊపిరితిత్తులు, గుండె, క్యాన్సర్, చర్మ వ్యాధులు ఎక్కువగా ఆ ప్రాంత ప్రజలను వేధించే అవకాశం ఉంటుందని అధికారులు వెల్లడించారు.