BTech Ravi : టీడీపీ నేత బీటెక్ రవి అరెస్టు..14 రోజుల రిమాండ్
మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ పులివెందుల నియోజకవర్గం ఇంచార్జ్ బీటెక్ రవికి కడప జిల్లా న్యాయమూర్తి 14 రోజులపాటు రిమాండ్ విధించారు. దీంతో ఆయన్ను పోలీసులు కడప జైలుకు తరలించారు.
మాజీ ఎమ్మెల్సీ పులివెందుల టీడీపీ ఇంఛార్జి బీటెక్ రవి (BTech Ravi) అరెస్ట్ అయ్యారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం (Yuvagalam) పాదయాత్ర ప్రారంభించడానికి రెండు రోజుల ముందు జనవరి 25న కడపలోని దేవుని కడప ఆలయం, పెద్ద దర్గా సందర్శనకు వచ్చారు. ఈ సందర్భంగా లోకేశ్‌కు స్వాగతం పలకడానికి పెద్దసంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బీటెక్ రవి కడప విమానాశ్రయం (Kadapa Airport) ముఖద్వారం వద్దకు చేరుకున్నారు. ఎయిర్ పోర్టులోకి ప్రవేశించడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులతో ఆయనకు వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. దాదాపు పది నెలల తర్వాత వల్లూరు పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు.
రవి పులివెందుల (Pulivendula) నుంచి బయలుదేరి కడప వస్తుండగా నంది మండలం వరకు ఫోన్లో అందుబాటులో ఉన్నారు. తర్వాత ఆయనతోపాటు.. డ్రైవరు, గన్‌మెన్, ఇతర సహాయకుల ఫోన్లు సైతం పని చేయలేదు. ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు పార్టీ కీలక నేతల దృష్టికి తీసుకెళ్లారు. ఇంతలోనే యోగి వేమన విశ్వవిద్యాలయం ఎదుట మఫ్టీలో ఉన్న పోలీసులు (Police) ఆయనను అదుపులోకి తీసుకున్నారు. బీటెక్ రవి ఈ సాయంత్రం నుంచి ఆచూకీ లేకపోవడంతో ఆయన కుటుంబ సభ్యుల్లోనూ, పార్టీ వర్గాల్లోనూ తీవ్ర ఆందోళన నెలకొంది. అయితే, బీటెక్ రవిని స్పెషల్ పార్టీ పోలీసులు కొప్పర్తి సెజ్ వద్ద అదుపులోకి తీసుకుని కడప రిమ్స్ (Rims)లో వైద్య పరీక్షల అనంతరం ఆయనను కడప మెజిస్ట్రేట్ ఎదుట పోలీసులు హాజరుపర్చగా.. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆయనను కడప జైలు(Prison)కు తరలించారు.