»Cid Has Registered A Cheating Case Against Ramoji Rao And Sailaja Kiran
AP CID: రామోజీరావు, శైలజా కిరణ్‌లపై చీటింగ్ కేసు నమోదు చేసిన సీఐడీ
మార్గదర్శి సంస్థ విషయంలో మరో చీటింగ్ కేసు నమోదైంది. రామోజీరావు తనను తుపాకీతో బెదిరించి తన వాటాను ఆయన కోడలు శైలజా కిరణ్‌పై రాయించారని మాజీ షేర్ హోల్డర్ గాదిరెడ్డి యూరిరెడ్డి ఫిర్యాదు చేశారు.
రామోజీ గ్రూప్ ఛైర్మన్ రామోజీరావు (Ramoji Rao), ఆయన కోడలు మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ శైలజా కిరణ్‌లపై సీఐడీ కేసు నమోదు చేసింది. మార్గదర్శి సంస్థ మాజీ షేర్ హోల్డర్ అయిన జగన్నాథరెడ్డి కుమారుడు గాదిరెడ్డి యూరిరెడ్డి వారిపై ఫిర్యాదు చేశారు. దీంతో వారిపై సెక్షన్ 42O, 467, 120-8, రెడ్ విత్ 34 ఐపీసీ కింద కేసును ఫైల్ చేశారు. మార్గదర్శిలో తమ షేర్ల వాటాను శైలజ పేరు మీదికి మార్చినట్లు ఫిర్యాదులో ఉంది. తనను బెదిరించి బలవంతంగా తన వాటా లాక్కున్నారని యూరిరెడ్డి ఫిర్యాదులో తెలిపారు.
తన వాటా షేర్లు రాసివ్వడానికి నిరాకరించడంతో రామోజీరావు తుపాకీతో తనను బెదిరించినట్లు తెలిపారు. 2016వ సంవత్సరం నాటికి తన పేరు మీద ఉన్న షేర్ల విలువ రూ.1,59,69,600 కాగా రామోజీరావు కేవలం రూ.39,74,000లు యూనియన్ బ్యాంక్ చెక్కు ఇచ్చినట్లు వెల్లడించారు. అయితే తాను సంతకం పెట్టలేదని, తన సంతకం ఫోర్జరీ చేసి తన పేరిట ఉన్న వాటాలను తమకు సంబంధించిన వారి పేరిట మార్చినట్లుగా యూరిరెడ్డి ఫిర్యాదులో తెలిపారు.
1962లో మార్గదర్శి చిట్ ఫండ్ పెట్టిన టైంలో తన తండ్రి జగన్నాథరెడ్డి రూ.5 వేలు పెట్టుబడి పెడితే ఆయన పేరుపై కొన్ని షేర్లను రామోజీరావు ఇచ్చినట్లు వివరించారు. తన తండ్రికి మార్గదర్శిలో షేర్లు ఉన్నాయని తెలిసి అపాయింట్ మెంట్ కోరితే చాలా రోజులు రామోజీరావు తనను కలవకుండా తిప్పించుకున్నారన్నారు. 2016లో రామోజీరావును కలిసిన సమయంలో బెదిరించి తన వాటా రాయించుకున్నారని యూరిరెడ్డి ఆరోపణలు చేశారు.