Chandrababu: స్కిల్ కేసులో అరెస్టై.. జైలులో ఊచలు లెక్కబెడుతోన్న మాజీ సీఎం చంద్రబాబు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఏసీబీ కోర్టు ఆదేశంతో ఇటీవల ఏసీని కూడా ఏర్పాటు చేశారు. చంద్రబాబు ఆరోగ్యం గురించి అధికారులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. అతను 67 కేజీలు బరువు ఉన్నారని తెలిపారు. విపరీతమైన వేడి, ఉక్కపోత వల్ల చంద్రబాబు డీహైడ్రేషన్, అలర్జీకి గురయ్యారు. ప్రస్తుతం చంద్రబాబుకు బీపీ 140/80 ఉందని.. నిమిషానికి పల్స్ 70 ఉందని తెలిపారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబుకు ఏసీబీ కోర్టు జ్యూడిషీయల్ రిమాండ్ విధించగా.. రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. జైలులో ఉక్కపోత, వేడి కారణంగా చంద్రబాబుకు వీపు, నడుము, ఛాతీ, చేతులు, గదువ ప్రాంతాల్లో ఎర్రటి దద్దుర్లు, పొక్కులు ఏర్పడ్డాయి. అరచేతుల్లో చీము పొక్కులు, శరీరమంతా తెల్లటి పొక్కులు వచ్చి తీవ్రమైన దురద ఏర్పడింది. వీటితో ఇబ్బంది పడుతున్నారని వైద్యులు జైలు అధికారులకు నివేదిక ఇచ్చారు. చంద్రబాబు తరపు న్యాయవాదులు ఏసీబీ కోర్టును ఆశ్రయించగా.. అతని బ్యారక్‌లో టవర్ ఏసీని ఏర్పాటు చేశారు. దీంతో అతని ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది.