స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు (Skill Developement Scam Case)లో టీడీపీ (TDP) అధినేత చంద్రబాబును సీఐడీ (CID) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ కేసుకు సంబంధించి చంద్రబాబు (Chandrababu) ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి అనుమానితులుగా ఉన్న మరికొందరిని సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. వారి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు, పలు ఆధారాలను సేకరించేందుకు అధికారులు విచారణ చేస్తున్నారు. విచారణలో భాగంగా నేడు కిలారు రాజేష్ (Kilaru Rajesh)ను అధికారులు పలు ప్రశ్నలు అడిగారు.
నారా లోకేశ్ (Nara Lokesh)కు సన్నిహితుడైన కిలారు రాజేష్‌ను సోమవారం ఉదయం నుంచి సీఐడీ పోలీసులు విచారించారు. సాయంత్రం వరకూ ఆ విచారణ సాగింది. ఈ నేపథ్యంలో విచారణ తర్వాత బయటకు వచ్చిన కిలారు రాజేష్ మీడియా ముందుకు వచ్చి పలు విషయాలను వెల్లడించారు. సీఐడీ విచారణ తమ లాయర్ ఎదురుగానే జరిగినట్లుగా కిలారు రాజేష్ తెలిపారు.
సీఐడీ విచారణ (CID Investigation)లో కిలారు రాజేష్‌ను అధికారులు మొత్తం 25 ప్రశ్నలు అడిగారన్నారు. అందులో 10 ప్రశ్నలు మాత్రం స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసుకు సంబంధించినవి కాగా, మిగిలిన 15 ప్రశ్నలు తన వ్యక్తిగత జీవితం గురించి అడిగినట్లుగా తెలిపారు. ఈ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని, కావాలనే తన పేరును అందులో చేర్చారని కిలారు రాజేష్ అన్నారు.
ఈ కేసుకు సంబంధించి మళ్లీ రేపు కూడా తాను విచారణకు హాజరుకానున్నట్లు తెలిపారు. అయితే సీఐడీ అధికారులు మాత్రం తమకు ఎటువంటి ఆధారాలు లభించాయో తెలుపలేదు. మంగళవారం కిలారు రాజేష్ (Kilaru Rajesh)ను ప్రశ్నించి ఇంకొన్ని సమాధానాలు రాబట్టేందుకు చూస్తున్నామన్నారు. ఈ కేసులో మరింత మందిని విచారించనున్నట్లు సీఐడీ (CID) అధికారులు ఇది వరకే తెలిపిన సంగతి తెలిసిందే.