Chandrababu: కుదుట పడని చంద్రబాబు ఆరోగ్యం.. నేడు మరోసారి వైద్య పరీక్షలు
స్కిల్ స్కామ్ కేసులో రాజమండ్రి జైలులో ఉన్న తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబుకు అనారోగ్య కారణాల రీత్యా హైకోర్టు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసిన విషయం తెలిసిందే.
Chandrababu:స్కిల్ స్కామ్ కేసులో రాజమండ్రి జైలులో ఉన్న తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబుకు అనారోగ్య కారణాల రీత్యా హైకోర్టు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసిన విషయం తెలిసిందే. ప్రత్యేక పరిస్థితుల్లో మధ్యంతర బెయిల్ ఇచ్చినందున ఆరోగ్య పరీక్షలు, చికిత్సకు మాత్రమే పరిమితమయ్యేలా కోర్టు కొన్ని షరతులు విధించింది. అంతే కాకుండా చంద్రబాబు కార్యకలాపాలను పరిశీలించేందుకు కొందరు అధికారులను తన వెంట ఉండేలా ఆదేశించింది. ఆయన కేవలం ఆస్పత్రికి తప్ప మరెక్కడికి వీలులేదు. ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు, ఎవరితో ఫోన్లో మాట్లాడేందుకు కూడా అనుమతి లేదు. అనారోగ్య కారణాలతో వచ్చిన బెయిల్ కాబట్టి ఆయన ఆస్పతి, ఇళ్లు తప్ప మరెక్కడికీ వెళ్లలేరు. ఈ క్రమంలోనే ఆయన గతంలో ఓ సారి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స మేరకు వెళ్లిన సంగతి తెలిసిందే.
నేడు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించాలని ఏఐజీ ఆస్పత్రి వైద్యులు నిర్ణయించారు. ఈ మేరకు చంద్రబాబుకు సమాచారం అందించారు. ఇటీవల ఏఐజీ ఆస్పత్రి వైద్యులు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి.. ఒకరోజు పాటు అబ్జర్వేషన్లో ఉంచిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మళ్లీ వైద్య పరీక్షలు చేయాల్సి రావడంతో ఆస్పత్రికి రావాల్సిందిగా ఆదేశించారు. దీంతో చంద్రబాబు నాయుడు మరోసారి జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి బయలుదేరారు. ఈ క్రమంలో దారిలో ఆయనను చూసేందుకు టీడీపీ నేతలు ఎగబడ్డారు. చంద్రబాబు తన కాన్వాయ్‌ని ఆపి వారికి అభివాదం చేశారు. దీంతో టీడీపీ క్యాడర్ సంతోషం వ్యక్తం చేసింది. అనంతరం చంద్రబాబు నాయుడు ఏఐజీ ఆస్పత్రికి చేరుకున్నారు. కాకపోతే సోమవారం చంద్రబాబుకు వైద్యుల బృందం పలు వైద్య పరీక్షలు, చర్మ చికిత్స అందించనున్నట్లు తెలుస్తోంది. గతంలోనే చంద్రబాబు కంటికి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయాలని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఎల్వీప్రసాద్ ఆస్పత్రిలో చంద్రబాబు కంటి ఆపరేషన్ చేయించుకోనున్నట్లు తెలుస్తోంది.