చంద్రబాబు కుప్పం పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆయన పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరును కార్యకర్తలు వ్యతిరేకించడంతో.. లాఠీఛార్జ్ కూడా జరిగింది. కాగా… పోలీసులు వ్యవహరించిన తీరు పై చంద్రబాబు సైతం మండిపడ్డారు.మీ అంతు చూస్తానంటూ పోలీసులపై బెదిరింపులకు దిగారు.
నిబంధనలు పాటించాల్సిందేనని బాబుకు పోలీసులు స్పష్టం చేయగా, నాకే రూల్స్ చెబుతారా అంటూ పోలీసులపై చంద్రబాబు ఆగ్రహం వెళ్లగక్కారు.సమావేశాలకు అనుమతి తప్పనిసరి అని పోలీసులు తేల్చి చెప్పారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సభలు నిర్వహించుకోవచ్చని పోలీసులు తెలిపారు. నేను అనుమతి తీసుకోవాలా అంటూ ఆగ్రహంతో చంద్రబాబు ఊగిపోయారు.
తన ఇంటికి తనని రానివ్వరా అంటూ ఆయన ప్రశ్నించారు. తన సొంత నియోజకవర్గంలో తనను పర్యటించకుండా, ర్యాలీ నిర్వహించకుండా, సభ పెట్టకుండా అడ్డుకుంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. తన కుప్పం పర్యటన గురించి నెల రోజుల క్రితమే డీజీపీకి లేఖ ఇచ్చామని చెప్పారు. రాష్ట్రంలో జగన్ పని అయిపోయిందని… టీడీపీ సభలకు ప్రజలు పోటెత్తుతున్నారని… అందుకే భయపడి చీకటి జీవో తీసుకొచ్చారని అన్నారు. నిన్న జగన్ సభకు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇచ్చి, వాటి బస్సుల్లో జనాలను తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. పెన్షన్ కట్ చేస్తామని బెదిరించి మహిళలను బలవంతంగా తరలించారని చెప్పారు.
ఇప్పుడు తన సొంత ఇల్లు కుప్పంకు తనను రానివ్వకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం, పోలీసుల దయాదాక్షిణ్యాలతో టీడీపీ సభలు పెట్టుకోవాలా అని ప్రశ్నించారు. తన ప్రజలతో తాను కలవకూడదా అని మండిపడ్డారు. పోలీసులు కూడా పద్ధతి ప్రకారం వ్యవహరించాలని అన్నారు. జగన్ నియంతగా మారారని… ఆయన పాలన పోవాలని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా మాట్లాడే హక్కు ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు.