»By Kicking With The Foot The Difficulties Will Go Away A Strange Custom That Has Been Followed For 400 Years
Kurnool: కాలితో తంతే కష్టాలు పరార్..400 ఏళ్లుగా పాటిస్తున్న వింత ఆచారం!
కాలితో తన్నగానే కష్టాలన్నీ పోతాయంటే ఎవరైనా నమ్ముతారా? ఈరోజుల్లో చాలా మంది నమ్మకపోవచ్చు. కానీ 400 ఏళ్లుగా ఆ వింత ఆచారాన్ని కొంత మంది పాటిస్తూ వస్తున్నారు. ఈ ఆచారం ఏపీలోని కర్నూలు జిల్లాలో హుల్తి లింగేశ్వరస్వామి ఆలయంలో ఉంది. 400 ఏళ్లుగా ఆలయంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆ ఉత్సవాల్లోనే ఈ వింత ఆచారాన్ని పాటిస్తూ వస్తున్నారు.
టెక్నాలజీ (Technology) అభివృద్ధి చెందుతున్నా..చంద్రునిపై భారత్ ప్రయోగాలు చేపడుతున్నా..ఇంకా మూఢనమ్మకాల ముసుగు చెల్లాచెదురు కాలేదు. ఎక్కడో ఒక చోట ఇంకా ఆ పాత ఆచారాలు అలానే కొనసాగుతున్నాయి. వింత ఆచారాలు, పూజలు, మూఢనమ్మకాలు మనుషులను ఆకట్టుకుంటూనే ఉన్నాయి. తాజాగా 400 ఏళ్లుగా పాటిస్తున్న ఓ వింత ఆచారం వెలుగుచూసింది. ఆ ఆచారం దేశంలో మరెక్కడో లేదు. మన తెలుగు రాష్ట్రాల్లో ఒక్కటైన ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh)లో ఆ ఆచారం కొనసాగుతూనే ఉంది.
ఏపీలోని కర్నూలు జిల్లా (Kurnool District) పత్తికొండ మండలంలో హుల్తి లింగేశ్వర స్వామి దేవాలయం (Hulthi Lingeswara Swamy Temple) ఉంది. పెద్దహుల్తి గ్రామంలో వెలసిన ఈ ఆలయంలో ప్రతి ఏటా ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలను చూసేందుకు వేలాది మంది వస్తుంటారు. దాదాపు 400 ఏళ్లుగా ఈ ఆలయంలో ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు చరిత్ర చెబుతోంది. ఈ ఆలయంలో వింత ఆచారం ఏమిటంటే..ఎవరికైనా కష్టాలు ఉంటే వారు స్వామి దర్శనం చేసుకుని బోర్లా పడుకోవాలి. ఆ తర్వాత స్వామి ఆవహించిన వ్యక్తి బోర్లా పడుకున్న వారిని కాలుతో తన్నుకుంటూ వెళ్తాడు. అలా స్వామి కాలితో తంతే వెంటనే కష్టాలన్నీ తొలగిపోతాయనే నమ్మకం ఉంది.
ఇకపోతే ఉద్యోగం రానివారు కూడా తమకు ఉద్యోగం వస్తుందని, అనారోగ్య సమస్యలున్నవారు ఆరోగ్యం బాగుపడాలని, ఆర్థిక కష్టాలు తీరాలని, సంతానం కలగాలని, ఇలా రకరకాలుగా ప్రజలు తమ బాధలు తీరేందుకు ఈ ఆచారాన్ని పాటిస్తుంటారు. ఉత్సవాల సమయంలో బోర్లా పడుకుని స్వామివారి తన్నుల కోసం ఎదురుచూస్తారు. స్వామివారు వారిని తన్నడంతో చాలా ఆనందపడతారు.
ఈ వింత ఆచారాన్ని చదువుకున్న వారు సైతం నమ్ముతుంటారు. పెద్దహుల్తి గ్రామం పరిసర ప్రాంతాల వారు కూడా ఇక్కడికొచ్చి తమ కష్టాలను చెప్పుకుని ఆచారాన్ని పాటిస్తారు. అలాగే పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ప్రతి ఏటా దీపావళి తర్వాత ఈ ఉత్సవం వైభవంగా జరుగుతుంది. ఉత్సవాలలో స్వామివారు భక్తుల కష్టాలకు పరిష్కార మార్గాలను కూడా చెబుతారు. రోబోలను సైతం డెవలప్ చేసిన ఈ రోజుల్లో కూడా ఇలాంటి ఆచారాలు పాటిస్తున్నారని సోషల్ మీడియా వేదికగా పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.