Rains : కర్నూలు జిల్లాలో భారీగా కురిసిన వర్షాలు.. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులు
ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీగా వర్షాలు కురిశాయి. దీంతో అక్కడ లోతట్టు ప్రాంతాలన్నీ జలమయంకాగా వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి. చదివేయండి.
Heavy Rains In Kurnool District : ఆంధ్రప్రదేశ్లో నైరుతీ రుతుపవనాల ప్రభావం వల్ల అక్కడక్కడా ఓ మోస్తరు నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. కర్నూలు జిల్లాలో(KURNOOL DISTRICT) బుధవారం భారీగా వర్షాలు కురిశాయి. దీంతో అక్కడి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. అక్కడి గార్గేయపురం చెరువు ఉప్పొంగి ప్రవహిస్తోంది. కర్నూలు దగ్గర నూతనపల్లి, వెంకాయపల్లి, మిలటరీ కాలనీ, లక్ష్మీనగర్, భూపాల్నగర్, నందవరం తదితర చోట్ల సైతం పలు కాలనీల్లో వాన నీరు చేరి జనం ఇబ్బందులు పడుతున్నారు.
కర్నూలులోని(KURNOOL) వెంకాయపల్లెలో ఉన్న ఎల్లమ్మ దేవాలయం లోకి సైతం వాన నీరు చేరింది. అక్కడి ప్రజల ఇళ్లల్లోకి సైతం వర్షపు నీరు చేరింది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అక్కడ వంతనపై సైతం నాలుగడుగుల మేర వరద నీరు చేరింది. దీంతో ఆ వంతెన మీదుగా ప్రవహిస్తున్న ఆర్టీసీ బస్సు వరద నీటిలో చిక్కుకుపోయింది. వంతెనపై నుంచి వాగు వైపుకి కాస్త వంగిపోయింది. అప్రమత్తం అయిన డ్రైవర్ బస్సును అక్కడికక్కడే నిలిపివేశారు. అందులో ప్రయాణిస్తున్న 25 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు దించేశారు. అలాగే పాలేరు వాగు వంతెనపై సైతం వాన నీరు ప్రవహిస్తోంది. దీంతో తిమ్మనేనిపేట, సంజామల రహదారిపై రాకపోకల్ని నిలిపివేశారు.