»Distinct Blue Ant Species Discovered In Arunachal Pradesh Valley
blue ants : అరుణాచల్ ప్రదేశ్లో అరుదైన నీలి చీమల జాతి గుర్తింపు
అరుణాచల్ ప్రదేశ్లోని ఓ లోయలో పరిశోధకులు అత్యంత అరుదైన నీలి చీమల జాతిని గుర్తించారు. ప్రపంచంలో ఉన్న చీమ జాతుల్లో ఇవి చాలా అరుదైనవని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
blue ants discovered : అత్యంత అరుదైన, అపూర్వమైన నీలి చీమల జాతిని పరిశోధకులు అరుణాచల్ ప్రదేశ్లోని ఓ లోయలో గుర్తించారు. మొత్తం భూమ్మీద ఉన్న 16,724 చీమ జాతుల్లో ఈ నీలి రంగువి అత్యంత అరుదైనవని తెలిపారు. జీవ వైవిధ్యానికి నెలవైన సియాంగ్ లోయలోని యింకు గ్రామంలో పరిశోధకులు ఈ చీమలను గుర్తించారు. వీటికి ‘పారా పారా ట్రెచినా నీల’(“Paraparatrechina Neela) అంటూ నామకరణం చేశారు.
బెంగళూరుకు చెందిన ఫెరిస్ క్రియేషన్స్, అశోకా జీవావరణ, పర్యావరణ పరిశోధనా సంస్థలు కలిసి ఈ లోయలో పరిశోధనలు చేపట్టాయి. యింకు గ్రామ సమీపంలో ఓ చెట్టు తొర్రలో ఈ నీలి చీమల జాతిని(blue ant species) గుర్తించాయి. పూర్వం 1912 – 1922 సంవత్సరాల్లో బ్రిటీషర్ల ప్రభుత్వం అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న స్థానిక తెగల్ని అణచివేసేందుకు అక్కడ దండయాత్ర చేసింది. ఆ సమయంలో వారి వెంట వెళ్లిన పరిశోధకులు భారతీయ మ్యూజియం కోసం కొన్ని రికార్డులను తీసుకున్నారు. ఆ తర్వాత జీవ వైవిధ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరూ అక్కడ పరిశోధనలు చేయలేదు. ఇటీవల కాలంలో మొదటిసారిగా బెంగళూరు సంస్థలు అక్కడ పరిశోధనలు నిర్వహించాయి. దీంతో ఈ నీలి చీమలు(blue ants) బయటపడ్డాయి.