China renames places in Arunachal : భారత సరిహద్దుల వెంబడి చైనా కవ్వింపు చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా అరుణాచల్ ప్రదేశ్లోని 30కి పైగా ప్రాంతాల పేర్లను చైనా మార్చివేసింది. ఈ విషయమై భారత విదేశాంగ మంత్రి జై శంకర్ మాట్లాడారు. నేను మీ ఇంటి పేరును మార్చినంత మాత్రాన అది నాది అవుతుందా? అంటూ ప్రశ్నించారు. చైనా(China) చర్యల్ని తీవ్రంగా ఖండించారు. నామకరణాలు చేసినంత మాత్రాన వాస్తవాలు మారవని జై శంకర్ అన్నారు.
జై శంకర్ గుజరాత్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా అక్కడ ఆయనను ఈ విషయమై ప్రశ్నించారు. దీంతో పై విధంగా ఆయన స్పందించారు. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమేనని అన్నారు. పేర్లు మార్చడం లాంటి చర్యలతో తమపై ఎలాంటి ప్రభావం ఉండదని అన్నారు. వాస్తవాధీన రేఖ వద్ద మన సైన్యం కట్టుదిట్టంగా ఉందని స్పష్టం చేశారు.
గత కొంత కాలంగా అరుణాచల్ ప్రదేశ్( Arunachal pradesh) తమదేనంటూ చైనా వితండ వాదం చేస్తోంది. ఈ క్రమంలోనే ఆ రాష్ట్రంలోని 30కి పైగా ప్రాంతాలకు కొత్తగా పేర్లు(renames) పెట్టినట్లు సమాచారం. 11 నివాస ప్రాంతాలు, 12 పర్వతాలు, నాలుగు నదులు, ఒక పర్వత మార్గం, ఒక భూభాగం, ఒక సరస్సు ఉన్నాయని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. అయితే ఇలా పేర్లు మార్చినంత మాత్రాన అవి చైనావి అయిపోవని జై శంకర్ సమాధానమిచ్చారు.