Dialogue Writer Sri Ramakrishna Died : డబ్బింగ్ సినిమాలకు మాటలు, డైలాగులు రాసే ప్రముఖ రైటర్ శ్రీ రామకృష్ణ (74) తుది శ్వాస విడిచారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి కన్ను మూశారు. దీంతో ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లాలోని తెనాలికి చెందిన ఆయన చాలా మంది సీనియర్లను వెండి తెరకు పరిచయం చేశారు.
తెనాలి వారు అయినప్పటికీ ఆయన వృత్తి రీత్యా చెన్నైలో స్థిర పడ్డారు. అటు తమిళ సినిమాలు, ఇటు తెలుగు సినిమాల్లోనూ ఆయన పట్టు సాధించారు. తెలుగులో(TELUGU) బొంబాయి, జీన్స్, ఒకే ఒక్కడు, అపరిచితుడు, జెంటిల్మన్, చంద్రముఖి లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు ఆయన మాటలు రాశారు. ఎక్కువగా శంకర్, మణిరత్నం లాంటి వారితో కలిసి పని చేశారు.
శ్రీ రామకృష్ణ (SRI RAMAKRISHNA) కెరియర్లో మొత్తం 300 సినిమాలకు పైగా డబ్బింగ్(DUBBING) డైలాగులు రాశారు. ఆయన డైలాగులు రాశారంటే కచ్చితంగా ఆ సినిమా హిట్ కొట్టాల్సిందేనని సిని వర్గాలు భావిస్తుంటాయి. బాలమురళీ ఎంఏ, సమాజంలో స్త్రీ లాంటి హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు. అయితే కొన్నాళ్లుగా ఆయన ఎక్కువ ప్రాజెక్టులకు ఒప్పుకోవడం లేదు. అనారోగ్య కారణాలు ఉండటం వల్ల సినిమాలకు దూరం ఉన్నారు.