Naxalites Killed In Encounter Chhattisgarh : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోలు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ భారీ ఎన్కౌంటర్ మంగళవారం చోటు చేసుకుంది. అక్కడి బీజాపూర్ జిల్లా, కొర్చెలి అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఘటనా స్థలం నుంచి మావోయిస్టుల మృత దేహాల్ని వారు స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలం నుంచి కొన్ని ఆయుధాలను సైతం స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు. మావోయిస్టుల ఏరివేత కోసం ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని వెల్లడించారు. దీనిపై ఇంకా పూర్తి వివరాలు బయటకు రావాల్సి ఉంది.
ఛత్తీస్‌గఢ్‌లో బీజాపూర్‌తో సహా ఏడు జిల్లాలున్న బస్తర్ ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది భద్రతా దళాలు ఈ ఆపరేషన్‌లో భాగంగా జరిపిన ఎన్కౌంటర్లలో(ENCOUNTERS) ఇప్పటి వరకు 34 మంది నక్సలైట్లు మృతి చెందారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఏప్రిల్ 19 న మొదటి దశ పోలింగ్ జరగనుంది. దీంతో ఈ ప్రాంతాన్ని మరింతగా జల్లెడ పడుతున్నారు.