NAXAL BLAST IN CHHATTISGARH : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో నక్సలైట్లు ఘాతుకానికి ఒడిగట్టారు. పోలీసు అధికారులను లక్ష్యంగా చేసుకుని వారు ఐఈడీలను అమర్చారు. అవి పేలడంతో ఇద్దరు కానిస్టేబుళ్లు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను వెంటనే హెలీకాఫ్టర్ ద్వారా దగ్గరలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన అక్కడి బీజాపూర్(BIJAPUR) జిల్లాలో చోటు చేసుకుంది.
ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవల నక్సలైట్ల ఏరివేత ఆపరేషన్లు వరుసగా జరుగుతున్నాయి. ఈ యాంటీ నక్సల్ ఆపరేషన్‌లో ఆ రాష్ట్ర పోలీసులు, సీఆర్పీఎఫ్ జవానులు, జిల్లా రిజర్వ్ గార్డ్, ఎస్టీఎఫ్లు పాల్గొంటున్నారు. బుధవారం రాత్రి నక్సల్ ఆపరేషన్‌ను ముగించుకుని తిరిగి వస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని తుర్రేమ్ ప్రాంతంలో మార్గ మధ్యంలో నక్సల్స్ బాంబులను అమర్చారు. వారు వచ్చే సమయంలో వాటిని పేల్చారు. దీంతో ఎస్టీఎఫ్ కానిస్టేబుళ్లు మృతి చెందారు. నారాయణపూర్ జిల్లాకు చెందిన సత్యర్ సింగ్ కాంగె, రాయపురకు చెందిన భరత్ సాహులు మరణించినట్లు అధికారులు వెల్లడించారు.
గడ్చిరోలీలో ఎన్కౌంటర్ : ఇదిలా ఉండగా మహారాష్ట్రలోని గడ్చిరోలీలో పోలీసులతో నక్సల్స్(NAXALS) ఎదురుపడ్డారు. ఈ సందర్భంలో ఇరు వర్గాల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. సుమారు ఆరుగంటలకు పైగా ఈ కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 12 మంది నక్సల్స్ మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి 3 ఏకే47లు సహా మొత్తం ఏడు అత్యాధునిక ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల మృత దేహాలను సైతం స్వాధీన పరుచుకున్నారు.