»8 Naxalites One Security Personnel Killed In Encounter In Chhattisgarh
Encounter: చత్తీస్‌గఢ్ లో జరిగిన ఎన్కౌంటర్లో 8మంది నక్సల్స్ మృతి
ఈ ఉదయం ఛత్తీస్‌గఢ్‌లోని అటవీ ప్రాంతంలో భద్రతాబలగాలు, నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది నక్సలైట్లు, ఓ భద్రతా సిబ్బంది మృతి చెందారు.
Chhattisgarh : ఛత్తీస్‌గఢ్ అడవుల్లో నక్సలైట్ల ఏరివేత కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఈ ఉదయం భద్రతా బలగాలు, నక్సలైట్లకు(Naxalites) మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. అబుజ్మాడ్ అడవుల్లో శనివారం తెల్లవారు జామున ఈ ఘటన జరిగింది. ఈ కాల్పుల్లో ఎనిమిది మంది నక్సలైట్లు మృతి చెందారు. ఓ భద్రతా సిబ్బంది ప్రాణత్యాగం చేశారు.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతేవాడ, కొండగావ్, కంకేర్, నారాయణపూర్ జిల్లాల్లో యాంటీ నక్సల్ ఆపరేషన్ కొనసాగుతున్న సమయంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఈ విషయాన్ని రాయ్‌పూర్ సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికీ ఇంకా అక్కడ ఫైరింగ్ జరుగుతున్నట్లు సమాచారం. స్పెషల్ టాస్క్ ఫోర్స్, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్, 53 బెటాలియన్ ఐటీబీపీకి చెందిన బలగాలు కలిసి సంయుక్తంగా యాంటీ నక్సల్ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి. ఈ నెల 12 మొదలైన కూంబింగ్ ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ ఆపరేషన్‌లో భాగంగా అడవుల్లో ఉన్న భద్రతా బలగాలకు నక్సల్స్ ఎదురుపడ్డారు. దీంతో ఈ ఎన్కౌంటర్(Encounter) చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.