Karimnagar : తమ కూతురు(Daughter) తమకు ఇష్టం లేకుండా ఇంటి పక్కనుండే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ కోపంతో అత్తారింటికి దారి లేకుండా రోడ్డు మధ్యలో గోడ కట్టారు తల్లిదండ్రులు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలోని ఎరడపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఈ గ్రామానికి చెందిన మమత, పొరిగింట్లో ఉండే రత్నాకర్ అనే అబ్బాయిని ఫిబ్రవరి 16న ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి మమత తల్లిదండ్రులకు ఇష్టం లేదు.
దీంతో పక్కింట్లో ఉండకుండా మమత, రత్నాకర్లో కేశవపట్నంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఎరడపల్లి వచ్చినప్పుడు తల్లిదండ్రుల ఇంటి మీదిగా అత్తగారింటికి వెళుతున్నారు. దీంతో మనస్తాపానికి గురైన మమత తల్లిదండ్రులు రోడ్డుకు మధ్యలో సిమెంటు ఇటుకలతో గోడ(wall) కట్టేశారు. దీంతో వేరే దొడ్డి దారి గుండా వీరు రాకపోకలు సాగిస్తున్నారు. తన తల్లిదండ్రులు అత్తారింటికి దారి లేకుండా చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని మమత కేశవపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు(Complaint) చేసింది. ఫిర్యాదు చేసినా పోలీసులు ఈ విషయంలో ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని, తమ సమస్యను పరిష్కరించాలని మమత కోరారు.