»Kedarnath Which Is Stuck In Snow The Temple Will Be Opened After 6 Months
Kedarnath: మంచులో కూరుకుపోయిన కేదార్నాథ్..6 నెలల తర్వాతే తెరుచుకోనున్న ఆలయం!
శీతాకాలం ప్రారంభమవ్వడంతో కేదార్నాథ్ ఆలయం మంచుతో కూరుకుపోయింది. ప్రతి ఏటా దీపావళి రెండో రోజున సాంప్రదాయబద్దంగా కేదార్నాథ్ ఆలయాన్ని మూసివేస్తారు. ఈసారి కూడా వేదమంత్రాల మధ్య ఆలయాన్ని మూసివేశారు. మరో ఆరు నెలల తర్వాతే ఆలయం తెరుచుకోనుంది.
శీతాకాలం రావడంతో ఉత్తరాఖండ్ (Uttarakhand)లోని కేదార్నాథ్ ఆలయం (Kedarnath Temple) మూతపడింది. సంప్రదాయ పద్దతిలో పండితులు వేద మంత్రాల మధ్య ఆలయాన్ని బుధవారం ఉదయం మూసివేశారు. ఈ కార్యక్రమానికి 2,500 మంది భక్తులు హాజరయ్యారు. ఆలయ మహా ద్వారం మూసివేసిన తర్వాత పంచముఖి డోలీలో కేదారేశ్వరుడిని ఉఖీమఠ్ లోని ఓంకారేశ్వరాలయానికి పండితులు తరలించారు. దీంతో మరో 6 నెలల పాటు కేదారేశ్వరుడు అక్కడే పూజలు అందుకోనున్నాడు.
ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ కేదార్నాథ్ ఆలయాన్ని 19.5 లక్షలకు పైగా భక్తులు దర్శించుకున్నారని ఆలయ కమిటీ ఛైర్మన్ అజేంద్ర అజయ్ వెల్లడించారు. అలాగే ఛార్ధామ్ లోని యమునోత్రిని కూడా నేడు మూసివేశారు. భక్తుల దర్శనాలను నిలిపివేసినట్లు ప్రకటించారు. యుమునా దేవిని ఉత్తరకాశీలోని ఖర్సాలీలో ఉన్న కుషిమఠ్కు పండితులు తరలించారు. ఇకపోతే గంగోత్రిని కూడా మంగళవారం రోజే మూసివేశామని, చివరికి బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 18వ తేది మూసివేయనున్నట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ వెల్లడించారు.
ఛార్ధామ్ ఆలయాలను ప్రతి ఏటా అక్టోబర్-నవంబరు నుంచి ఏప్రిల్-మే నెల వరకూ మూసివేసి ఉంచుతారు. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో మంచు కమ్మేసి ఉంది. దాంతో పాటుగా శీతల గాలులు కూడా వీస్తున్నాయి. హిమాలయాల చెంత ఉండటం వల్ల ఇక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ప్రస్తుతం కేదార్నాథ్ మంచుతో కూరుకుపోయి ఉంది. అలాగే మిగిలిన ఆలయాల్లో మంచు వ్యాపించి ఉంది. ఇలాంటి సమయంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఆలయ పరిసరాల్లో ఉన్నటువంటి భక్తులను, స్థానికులను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.