Chardham: భారీ వర్షాలు.. చార్‌థామ్ యాత్ర నిలిపివేత
ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధాన నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. చాలాచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో భారత వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసి.. చార్‌థామ్ యాత్రను వాయిదా వేసింది.
Chardham: ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధాన నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. చాలాచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో భారత వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో అతి భారీ వర్షాలు అవకాశం ఉందని హెచ్చరించింది. ఉత్తరాఖండ్‌లోని గర్వాల్ ప్రాంతంలో ఈరోజు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. అందుకే చార్ధామ్ యాత్రను వాయిదా వేసినట్లు గర్వాల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే తెలిపారు.
వర్షాల కారణంగా చమోలీ జిల్లాలోని బద్రీనాథ్ నేషనల్ హైవేపై చాలా చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కర్ణప్రయాగ, గౌచర్ మధ్యలోని బద్రీనాథ్ నేషనల్ హైవేపై నిన్న ఓ ప్రమాదం కూడా జరిగింది. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు బద్రీనాథ్ ఆలయాన్ని దర్శించుకుని బైక్‌పై తిరిగివస్తుండగా మార్గమధ్యంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రాంనగర్‌లోని ఓ వంతెన కూడా కూలిపోయింది. రెడ్ అలర్ట్ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్ని కలెక్టర్లను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.