Stag Beetle: Are you surprised to know the cost of this insect?
Stag Beetle: స్టాగ్ బీటిల్ పురుగు ఖరీదు తెలిస్తే షాక్ కావాల్సిందే. దీని ఖరీదు రూ.75 లక్షలు ఉంటుందట. అసలు ఈ పురుగు ఖరీదు ఎందుకు అంత ఉంటుందో తెలుసుకుందాం. ఈ పురుగు చాలా అరుదైనది. దీనిని అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. ఇది చెక్కలపై ఆధారపడి జీవించే కీలక జాతికి చెందినది. అటవీ పర్యావరణంలో ఇది చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. లండన్‌కు చెందిన నేచురల్ హిస్టరీ మ్యూజియం ప్రకారం ఈ పురుగు బరువు 2-6 గ్రాముల మధ్యలో ఉంటుంది. ఇది దాదాపు 3-7 సంవత్సరాలు జీవిస్తుంది. మగ పురుగులు 35-70 మిల్లీమీటర్ల పొడవు, ఆడపురుగులు 30-50 ఎంఎం పొడవు ఉంటాయి. ఈ కీటకాలను చికిత్సలోనూ వాడతారు.
ఈ పురుగులకు ఉన్న కొండీలు మగ జింకల కొమ్ములను పోలి ఉండటంతో వీటిని స్టాగ్ బీటిల్స్ అనే పేరు వచ్చింది. ఇవి సంతానోత్పత్తి సమయంలో ఆడపురుగులతో జత కట్టేందుకు ఈ కొండీలను పరస్పరం కొడుతూ విచిత్రమైన చప్పుడు చేస్తాయి. స్టాగ్ బీటిల్స్ ఉష్ణమండల ప్రాంతాల్లో ఎక్కువగా జీవిస్తాయి. వీటికి చలి పడదు. ఎక్కువగా అడవుల్లో ఉంటాయి.. కొన్ని సందర్భాల్లో తోటలు, పార్కులు వంటి నగర నాగరిక పరిసరాల్లోనూ జీవిస్తాయి. ముఖ్యంగా చనిపోయిన వృక్షాల కలపను నివాసంగా చేసుకొంటాయి. పెద్ద స్టాగ్ బీటిల్స్ చెట్ల నుంచి ‘సాప్’ అనే ద్రవాన్ని, కుళ్లిన పండ్ల నుంచి కారే తీపి స్రావాలను తిని జీవిస్తాయి. లార్వాదశలో ఇవి తీసుకొన్న ఆహారం నుంచి వచ్చే శక్తిపైనే అధికంగా ఆధారపడతాయి. తొలిదశలో ఇవి కలపను తన పదునైన దవడలతో చీల్చి తింటాయి. ఇవి పచ్చటి మొక్కలకు హాని చేయవు. కేవలం మృత వృక్షాలను మాత్రమే ఆహారంగా తీసుకొంటాయి.