SAP Layoff : ప్రస్తుతం ఐటీ ఇండస్ట్రీలో లేఆఫ్స్ జరుగుతున్నాయి. ఏదో చిన్న కంపెనీలలో అయితే పెద్దగా ఇప్పుడు మనం దీని గురించి చర్చించుకునే వాళ్లమే కాదు. కానీ.. ప్రపంచంలోనే టాప్ కంపెనీలు అయిన గూగుల్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, అమెజాన్ లాంటి సంస్థలు తమ కంపెనీలలో దశాబ్దాలుగా పని చేస్తున్న ఉద్యోగులను కూడా తొలగించాయి. ఒకేసారి వేల సంఖ్యలో ఉద్యోగాలను తీసేయడంతో ఐటీ ఉద్యోగులు షాక్ అవుతున్నారు. కేవలం ఈ కంపెనీలే కాదు.. వాటిని చూసి మిగితా చాలా కంపెనీలు కూడా ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాయి. తాజాగా వాటి లిస్టులో జర్మనీకి చెందిన సాఫ్ట్ వేర్ దిగ్గజ సంస్థ ఎస్ఏపీ చేరింది. ఈ కంపెనీ ప్రాడక్ట్ ఎస్ఏపీని పెద్ద పెద్ద కంపెనీలు వినియోగిస్తున్నాయి. అలాంటి కంపెనీ ఒకేసారి 3000 ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది.
కోర్ బిజినెస్ ను వృద్ధిలోకి తీసుకొచ్చేందుకు రీస్ట్రక్షరింగ్ ప్రోగ్రామ్ ను టార్గెట్ చేశామని, అందులో భాగంగానే లేఆఫ్స్ ప్రక్రియను కూడా ప్రారంభించినట్టు కంపెనీ వెల్లడించింది. ఈ కంపెనీకి ప్రపంచ వ్యాప్తంగా 1,20,000 మంది ఉద్యోగులు ఉన్నారు. అందులో 3000 ఉద్యోగాలు పోనున్నాయి. వీళ్లను ఉద్యోగంలో నుంచి తీసేయడం వల్ల కంపెనీకి 2023 తొలి త్రైమాసికంలో 250 నుంచి 300 మిలియన్ల యూరోలు మిగలనున్నాయట. అంటే మన కరెన్సీలో సుమారుగా రూ.2668 కోట్లు. ఈ డబ్బును కోర్ క్లౌడ్ బిజినెస్ ను వృద్ధిలోకి తీసుకొచ్చేందుకు కంపెనీ వినియోగించనుంది. కాగా, 2022 లో ఎస్ఏపీ 30.9 బిలియన్ యూరోల రెవెన్యూను సాధించింది. గత సంవత్సరంతో పోల్చితే అది 11 శాతం పెరుగుదల. 2023 లో కనీసం 10 నుంచి 13 శాతం లాభాలు వచ్చే అవకాశం ఉందని కంపెనీ అంచనా వేస్తోంది.