Sony: జపాన్‌కు చెందిన టెక్నాలజీ దిగ్గజం సోనీ తన ప్లే స్టేషన్ విభాగంలో పనిచేస్తున్న సుమారు 900 మంది ఉద్యోగులను తక్షణమే తొలగిస్తున్నట్లు ప్రకటించించి. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగులకు కష్టతరమైనప్పటికీ తప్పట్లేదని సంస్థ వర్గాలు తెలిపాయి. సంస్థ తాజా నిర్ణయంతో దాదాపు ఎనిమిది శాతం ఉద్యోగులు తగ్గినట్లవుతుందని తెలిసింది. టెక్, గేమింగ్ రంగంలో లేఆఫ్‌లను ప్రకటించిన తాజా సంస్థ ఇదే. పరిశ్రమలో వస్తున్న మార్పులే ఇందుకు కారణమని సోనీ ఇంటరాక్టివ్ ఎంటర్టైన్మెంట్ సీఈఓ జిమ్ ర్యాన్ పేర్కొన్నారు. యూకే, యూరోపియన్ స్టూడియోలలో ‘ప్లేస్టేషన్ స్టూడియోస్ లండన్ స్టూడియో’ను పూర్తిగా మూసివేయనున్నట్లు తెలిపారు. గెరిల్లా, ఫైర్స్ప్రైట్ విభాగాల్లో కూడా ఉద్యోగుల తగ్గింపులు ఉండనున్నాయని చెప్పారు.
డిసెంబరు 31, 2023తో ముగిసిన త్రైమాసికంలో ఐదు గేమింగ్ విభాగాల్లో విక్రయాలు తగ్గడంతో సోనీ గ్రూప్ ఈ నెల ప్రారంభంలో వాటి ఆదాయ అంచనాను తగ్గించింది. యాక్టివిజన్ బ్లిజార్డ్ కొనుగోలు అనంతరం 2,000 మంది సిబ్బందిని తొలగిస్తామని నెల కిందట మైక్రోసాఫ్ట్ పేర్కొన్న సంగతి తెలిసిందే. మరోవైపు రియోట్ గేమ్స్ సంస్థ జనవరిలో 11 శాతం ఉద్యోగులను తగ్గించుకొంది. గత ఏడాదిలో అమెరికా ఐటీ కంపెనీలు దాదాపు 2.40 లక్షల మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ 32,000 ఐటీ ఉద్యోగాలు పోయినట్లు తెలుస్తోంది.