వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మమ్మ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు ప్రకటించారు. గత నాలుగు రోజులుగా కర్నూల్లోని విశ్వభారతి ఆస్పత్రిలో ఆమె చికిత్స చేయించుకుంటున్నారు. అయితే గుండెకు సంబంధించి పలు సమస్యలు తెలెత్తడంతో ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ క్రమంలో ఆమె నాన్ఎస్టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ ఫెక్షన్ కు గురైనట్లు వైద్యులు తెలిపారు. అంజియో గ్రామ్ చేశాక కూడా ఆమె పరిస్థితి అదుపులోకి రాలేదన్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నఆమెకు బీపీ కూడా తగ్గువగా ఉందన్నారు. దీంతోపాటు ఆమెకు వికారం వాంతులు కూడా అవుతున్నాయని వైద్యులు చెప్పారు. ఈ నేపథ్యంలో ఆమె మరిన్ని రోజులు ఆస్పత్రిలోనే ఉండాల్సిన అవసరం ఉందని డాక్టర్లు స్పష్టం చేశారు.
అయితే తన తల్లి లక్ష్మమ్మకు ఐసీయూలో చికిత్స కొనసాగుతుండగా ఎంపీ అవినాష్ రెడ్డి కూడా ఆస్పత్రిలోనే ఉండి తల్లి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి తల్లిని పరామర్శించేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, వైయస్ఆర్ జిల్లా పార్టీ నాయకులు, అవినాష్ అనుచరులు పెద్దసంఖ్యలో ఆసుపత్రికి తరలివస్తున్నారు.
మరోవైపు ఇదే ఆస్పత్రికి సీబీఐ అధికారులు కూడా రావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే మే 22న అవినాష్ రెడ్డి హాజరు కావాలని సీబీఐ నోటీసులు పంపింది. కానీ తాను విచారణకు రాలేనని మళ్లీ తిరిగి లేఖ పంపండంతో అధికారులు రంగంలోకి దిగారు. విషయం తెలుసుకున్న అవినాష్ రెడ్డి కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ నేపథ్యంలో అవినాష్ ను అధికారులు అరెస్టు చేస్తారా అనే చర్చ జరుగుతుంది.