మార్గదర్శి(Margadarsi) కేసులో ఏపీ సీఐడీ(CID) రామోజీరావు(Ramojirao)కు షాకిచ్చింది. ఈ కేసుకు సంబంధించిన భారీగా ఆస్తులను అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. రామోజీరావుకు సంబంధించిన దాదాపు రూ.793 కోట్ల విలువైన ప్రాపర్టీని ఈ కేసులో సీఐడీ అటాచ్ చేసింది. దీనికి సంబంధించి సీఐడీ అధికారులు సోమవారం కీలక ప్రకటన చేశారు.
ఏపీలో 37 బ్రాంచ్‌ల ద్వారా మార్గదర్శి(Margadarsi) వ్యాపారం సాగుతోందని సీఐడీ(CID) తెలిపింది. చిట్స్ ద్వారా సేకరించిన డబ్బును హైదరాబాద్ కార్పొరేట్ ఆఫీస్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టినట్లు వెల్లడించింది. ఖాతాదారులకు వెంటనే డబ్బు ఇచ్చే స్థితిలో మార్గదర్శి ప్రస్తుతం లేదని తెలిపింది.
మార్గదర్శి(Margadarsi) ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, ఫోర్‌మెన్, ఆడిటర్లు కుట్ర చేశారని, పలు నేరాలకు వారంతా పాల్పడినట్లు సీఐడీ అధికారులు ప్రకటించారు. ఏపీలో మార్గదర్శి సంస్థకు సంబంధించి 1989 చిట్స్ గ్రూపులు ఉన్నాయని, తెలంగాణలో 2,316 చిట్స్ గ్రూప్స్ ఉన్నట్లు సీఐడీ వెల్లడించింది. ఈ కేసులో దాదాపు రూ.793 కోట్ల విలువైన ప్రాపర్టీని అటాచ్ చేసినట్లు సీఐడీ(CID) అధికారులు తెలిపారు. త్వరలోనే ఈ కేసు కొలిక్కి వస్తుందన్నారు.