నందమూరి తారకరత్న ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై ఉన్నాడు. తాజా ఆయన మెదడుకు స్కాన్ తీసినట్లు హిందూపూర్ పార్లమెంట్ జనరల్ సెక్రటరీ అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. తారకరత్నను చూసేందుకు వెళ్లిన ఆయన వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. తారకరత్నకు వచ్చే రిపోర్టును బట్టీ మెదడు పరిస్థితి ఎలా ఉందనేది తెలుస్తుందని, దాన్ని బట్టి ఆయన్ని విదేశాలకు తీసుకెళ్లే ఆలోచనలో కుటుంబీకులు ఉన్నారని లక్ష్మీనారాయణ వెల్లడించారు. ప్రస్తుతం వెంటిలేటర్ పై తారకరత్నకు చికిత్స అందుతోందన్నారు. కుప్పంలో నారా లోకేశ్ చేపట్టిన యువగళం యాత్రలో తారకరత్న గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే.
ఆ సమయంలో గుండె ఆగిపోవడం వల్ల తారకరత్న మెదడులోని పైభాగం దెబ్బతిందని డాక్టర్లు తెలిపారు. అలా జరగడం వల్ల మెదడులోకి నీరు చేరి వాచిందని, మెదడు వాపు తగ్గిన వెంటనే బ్రెయిన్ రికవరీ అవుతుందని డాక్టర్లు వెల్లడించారు. వారం రోజులుగా తారకరత్న వెంటిలేటర్‌పైనే ఉన్నాడని, ఇంకా స్పృహలోకి రాలేదన్నారు. తారకరత్నను కాపాడేందుకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ డాక్టర్లు అహర్నిశలు కృషి చేస్తున్నారని అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. మరోవైపు తారకరత్న కోలుకోవాలని టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రార్థనలు చేస్తున్నారు.