బెంగళూరు నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో 23 రోజుల పాటు చికిత్స పొందుతూ రెండు రోజుల క్రితం కన్నుమూసిన నందమూరి తారకరత్న మృత దేహాన్ని నిన్న హైదరాబాద్ లోని ఆయన నివాసానికి తరలించారు. నేడు ఉదయం.. ప్రజలు, అభిమానుల సందర్శనార్థం ఫిల్మ్ ఛాంబర్ లో ఉంచారు.
బెంగళూరు నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో 23 రోజుల పాటు చికిత్స పొందుతూ రెండు రోజుల క్రితం కన్నుమూసిన నందమూరి తారకరత్న(tarakaratna) మృత దేహాన్ని నిన్న హైదరాబాద్ లోని (hyderabad) ఆయన నివాసానికి తరలించారు. నేడు ఉదయం.. ప్రజలు, అభిమానుల సందర్శనార్థం ఫిల్మ్ ఛాంబర్ లో ఉంచారు. మధ్యాహ్నం మూడు గంటల వరకు భౌతికకాయాన్ని అక్కడే ఉంచనున్నారు. సాయంత్రం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున ఫిలింఛాంబర్‌కు తరలివస్తున్నారు. తారకరత్న తల్లిదండ్రులు మోహన్ కృష్ణ, సీత ఫిల్మ్ ఛాంబర్‌కు చేరుకున్నారు. నందమూరి కుటుంబ సభ్యులు కూడా చేరుకుంటున్నారు.
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) సోమవారం ఫిల్మ్ ఛాంబర్ లో తారకరత్న భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం తలసాని మాట్లాడారు. తారకరత్న మరణం చాలా బాధాకరమన్నారు. 40 ఏళ్ల వయస్సులోనే తారకరత్న చనిపోయవడం విచారకరమన్నారు. 20 ఏళ్లలోనే పరిశ్రమలోకి అడుగుపెట్టి 24 వరకు సినిమాల్లో నటించారని గుర్తు చేశారు. తాత నందమూరి తరాల రామారావు అడుగుజాడల్లో నడవాలనుకున్నారన్నారని చెప్పారు. తారకరత్న కుటుంబానికి, నందమూరి కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థించారు.
కాగా.. తారకరత్న శనివారం రాత్రి బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రి (Narayana Hrudayalaya Hospital)లో కన్నుమూశారు. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు జనవరి 27న కుప్పం చేరుకున్నారు. అక్కడ గుండెపోటు కారణంగా తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఒక్కసారిగా కుప్పకూలిన తారకరత్నను పార్టీ కార్యకర్తలు వెంటనే కుప్పంలోని కేసీ హాస్పిటల్ లో ప్రాథమిక చికిత్స అనంతరం పీఈఎస్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అదే రోజు రాత్రి గ్రీన్ చానల్ ద్వారా ఆయన్ను బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ కు తరలించారు. గుండెపోటుకు గురైన సమయంలో తారకరత్న మెదడుకు దాదాపు 45 నిమిషాలు రక్తప్రసరణ ఆగిపోవడంతో మెదడులోని కొంతభాగం దెబ్బతిన్నట్లు వైద్యులు గుర్తించారు. అప్పటి నుంచి వైద్యులు ఆయనకు చికిత్సను అందిస్తూ వచ్చారు. కానీ రెండు రోజుల క్రితం మృతి చెందారు.