దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కి అనేక అవార్డులను గెలుచుకుంటోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు కలిసి నటించిన ఈ సినిమా భారీ హిట్ అందుకుంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే నాటు నాటు పాటకు గాను గోల్డెన్ గ్లోబ్ అవార్డు లభించింది. అంతేకాకుండా పలు అంతర్జాతీయ స్థాయి అవార్డులు కూడా దక్కాయి. ఆస్కార్ అవార్డుకు కూడా నాటు నాటు పాట నామినేట్ అయ్యి రికార్డు నెలకొల్పింది.
తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాకు మరో అంతర్జాతీయ అవార్డు లభించింది. రోటెన్ టొమాటోస్ వారు అందిస్తున్న అంతర్జాతీయ అవార్డును ఆర్ఆర్ఆర్ సొంతం చేసుకుంది. 2022 ఫ్యాన్స్ ఫేవరెట్ సినిమాగా ”గోల్డెన్ టొమాటో” అవార్డును ఆర్ఆర్ఆర్ సొంతం చేసుకుంది. తాజాగా దీనికి సంబంధించి అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ వచ్చింది. వంద కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించారు. తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి ఆర్ఆర్ఆర్ తీసుకెళ్లడంతో సినీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.