‘బిచ్చగాడు’ సినిమా ద్వారా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పాపులారిటీని సంపాదించుకున్న తమిళ హీరో విజయ్ ఆంటోనీ ప్రమాదానికి గురయ్యారు. సినిమా షూటింగ్ జరుగుతుండగా విజయ్ ఆంటోనీ ఓ బోట్ ప్రమాదంలో తీవ్రంగా గాయాలపాలయ్యాడు. మలేషియాలో ‘బిచ్చగాడు-2’ షూటింగ్ జరుగుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రస్తుతం విజయ్ ఆంటోనీ పరిస్థితి విషమంగా ఉందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ప్రచారంలో వాస్తవం లేదని, విజయ్ ఆంటోనీ నడుముకు చిన్నపాటి దెబ్బ మాత్రమే తగిలిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం విజయ్ ఆంటోనీ చెన్నై చేరుకున్నాడని, త్వరలోనే ఆయన కోలుకుని అందరి ముందుకు వస్తాడని కుటుంబ సభ్యులు క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలను పట్టించుకోవద్దని తెలిపారు.