ప్రపంచంలో పులులు ఎక్కువగా ఆఫ్రికాలో ఉంటాయని అందరూ అనుకుంటారు. కానీ నిజానికి ప్రపంచంలోనే అత్యధిక పులులు ఉండేది భారత్ లోనే. 70 శాతం పెద్ద పులులు ఇండియాలోనే ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్ర సర్కార్ స్వయంగా సుప్రీం కోర్టుకు వెల్లడించింది. పులుల వేట పట్ల కఠినంగా వ్యవహరించడం వల్ల వారి సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. దీంతో పెద్ద పులుల సంతతి భారత్ లో పెరిగిందని కేంద్రం తెలిపింది. దేశంలో ఏటా 6 శాతం పులుల సంఖ్య పెరుగుతూ వస్తోందని, ఒక అఫిడవిట్ ను కూడా దాఖలు చేసింది.
ఇండియాలో 2018లోనే పెద్ద పులుల సంఖ్య రెట్టింపు అయ్యిందన్నారు. పులుల సంరక్షణ విషయంలో నాలుగేళ్లకు ముందే తమ లక్ష్యాన్ని సాధించినట్లు కేంద్ర సర్కార్ తెలిపింది. అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి ఈ మేరకు సుప్రీం కోర్టుకు పలు వివరాలను అందించారు. భారత్ లో పులుల అభయారణ్యాల సంఖ్య 53కు చేరుకున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా వాటి పరిధిలో 76,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 2,967 పులులు ఉన్నాయని, పెద్ద పులుల కృత్రిమ సంతానోత్పత్తికి అవకాశం లేదని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఈ అఫిడవిట్ లో వివరాలను వెల్లడించింది. ప్రపంచంలోనే పులులకు రాజధానిగా భారత్ ఉందని, ఇది ఎంతో సంతోషించాల్సిన విషయం అని కేంద్రం తెలిపింది.