Narendra Modi: ప్రధాని నరేంద్ర మోడీ రేడియా కార్యక్రమం మన్ కీ బాత్ ద్వారా ఈరోజు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ఏడాదికి ఇదే చివరి మన్ కీ బాత్ కార్యక్రమం. కుటుంబంలోని వ్యక్తులను కలిసిన తర్వాత నాకు ఎలా అనిపిస్తుందో, ఈ రేడియా కార్యక్రమం ద్వారా మీతో మాట్లాడిన తర్వాత కూడా అలాగే అనిపిస్తోందని మోడీ తెలిపారు. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి.. 2023లో భారత్ సాధించిన విజాయాలను గుర్తు చేశారు.
ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మహిళా బిల్లుకు ఈ ఏడాదే ఆమోదం లభించిందని మోదీ గుర్తుచేశారు. భారత్ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని తెలిపారు. ప్రతిష్ఠాత్మక జీ20 సదస్సును విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో ప్రతి ప్రాంతం ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంది. దేశ ప్రజల్లో వికాస, స్వయం సమృద్ధి భారత్ స్ఫూర్తి రగిలిందని చెప్పారు. 2024లోనూ ఇదే కొనసాగించాలని పిలుపునిచ్చారు.
అలాగే నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు గురించి మాట్లాడారు. ఎలిఫెంట్ విస్పరర్స్‌కు కూడా అవార్డు రావటంతో భారతీయుల ప్రతిభ కనభరిచందని తెలిపారు. ఈ ఏడాది భారతీయుల సృజనాత్మకతను యావత్ ప్రపంచం వీక్షించిందని తెలిపారు. అలాగే క్రీడాకారులు కూడా ఆసియా క్రీడల్లో 107, పారా గేమ్స్‌లో 111 పతకాలతో సత్తాచాటారని గుర్తుచేశారు. అలాగే వన్డే ప్రపంచ కప్‌లో భారత క్రికెట్ జట్టు అందరి మనసులు గెలుచుకుందని ప్రశంసించారు.
చంద్రయాన్-3 విజయవంతంపై కూడా మోదీ మాట్లాడారు. శాస్త్రవేత్తల కృషితో ఈ ప్రతిష్ఠాత్మక ప్రయోగం విజయవంతమైందని అందరికీ గర్వకారణమని తెలిపారు. అలాగే శారీరక, మానసిక ఆరోగ్య ప్రాముఖ్యతను గురించి చెప్పారు. ఈ సందర్భంగా ఫిట్ ఇండియాలో భాగంగా తీసుకున్న పలు చర్యలను తెలిపారు. ఈక్రమంలో ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్, భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్, నటుడు అక్షయ్ కుమార్ తన ఫిట్నెస్ రహస్యాలను పంచుకున్నారు.