ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధ వాతావరణం ఇంకా చల్లారలేదు. రెండున్నర నెలలుగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధం కారణంగా ఇప్పటి వరకూ 21 వేల మందికి పైగా మరణించారు. చాలా వరకూ ఆస్తి నష్టం వాటిళ్లింది. అయితే తాజాగా హమాస్, ఇజ్రాయెల్ సైనికుల పరస్పర దాడుల వల్ల గత 24 గంటల్లో 200 మంది ప్రాణాలు వదిలారు.
హమాస్ సొరంగాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నట్లు ఆ దేశ ఆర్మీ వెల్లడించింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ సైనికులు హమాస్ పై వైమానిక దాడులు చేపట్టారు. హమాస్ లోని పలు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ ట్యాంకులతో పాటుగా విమానాలు వెనువెంటనే దాడులు చేపట్టాయి. ఈ ఘటనలో 200 మంది వరకూ మరణించినట్లు అధికారులు వెల్లడించారు.
సెంట్రల్ గాజాలోని నుసిరత్ శిబిరంపై ఐడీఎఫ్ వైమానిక దాడుల వల్ల చాలా మంది గాయాలపాలయ్యారు. వారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరో వైపు ఈ యుద్ధం కారణంగా ఏడు వేల మందికి పైగా చిన్నారులు మరణించినట్లు పాలస్తీనియన్ మెడిక్స్ వెల్లడించింది. ప్రస్తుతం యుద్ధం కొనసాగుతోందని, హమాస్ లో ప్రజలు భయానక వాతావరణంలో బతుకుతున్నారని అధికారులు తెలిపారు.