Andhrapradesh: ‘జన్ మత్ పోల్’ సర్వే..ఏపీలో మళ్లీ వైసీపీదే విజయం!
ఏపీలో ఈసారి ఎన్నికల్లో కూడా వైసీపీనే విజయం సాధిస్తుందని జన్ మత్ పోల్ సంస్థ స్పష్టం చేసింది. ఏపీ ప్రజలు అధికార పార్టీ అయిన వైసీపీకే పట్టం కడతారని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల హడావుడి మొదలైంది. ఈసారి కూడా అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ఏపీలోని వైసీపీ తమ పార్టీలో కీలక మార్పులు చేస్తూ వస్తోంది. మరోవైపు టీడీపీ, జనసేన కూటమి కూడా ఈసారి గెలుపే లక్ష్యంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ తమ ఉనికిని చాటుకునేందుకు రేసులోకి వస్తోంది. ఏపీ ఎన్నికలకు సంబంధించి ఈపాటికే కొన్ని సంస్థలు పలు సర్వేలను పూర్తి చేశాయి.
తాజాగా జన్ మత్ పోల్స్ సర్వే ప్రకారంగా ఏపీలో 116 నుంచి 118 స్థానాల్లో వైసీపీ గెలుస్తుందని తేలింది. దీంతో మరోసారి ప్రజల మద్దతు వైసీపీకే ఉంటుందని ఆ సంస్థ స్పష్టం చేసింది. గతంలో టైమ్స్ నౌ, పొలిటికల్ క్రిటిక్, పోల్ స్ట్రాటజీ గ్రూపు సర్వేలు కూడా వైసీపీనే గెలుస్తుందని చెప్పాయి. మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో జన్ మత్ పోల్స్ సంస్థ సర్వే చెప్పిన ఫలితాలే నిజం అయ్యాయి. అదే సంస్థ ఇప్పుడు ఏపీలో గెలిచేది వైసీపీనే అని చెప్పడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
జగనన్న ప్రభుత్వానికి ప్రజలు మరోమారు పట్టం కట్టనున్నట్లు జన్ మత్ పోల్స్ స్పష్టం చేసింది. ఆ సంస్థ సర్వేలో టీడీపీ, జనసేన కూటమికి కేవలం 46 నుంచి 48 సీట్లు మాత్రమే దక్కుతాయని చెప్పింది. ఏపీ ప్రజలంతా వైసీపీకే జై కొడతారని తేల్చింది. పొలిటికల్ క్రిటిక్ సర్వేస్ అండ్ అనాలసిస్ సంస్థ కూడా తమ సర్వేలో వైసీపీకి 135 వరకు సీట్లు వచ్చి అధికారాన్ని చేపడుతుందని వెల్లడించింది.