Reliance Bharatgpt: చాట్ జీపీటీకి పోటీగా భారత్ జీపీటీ
ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన పాపులర్ ఓపెన్ఏఐ టూల్ చాట్‌జీపీటీకి పోటీగా జియో నుంచి సరికొత్త ఏఐ ప్రొగ్రామ్ ‘భారత్ జీపీటీ’ పేరుతో అందుబాటులోకి రానుందని ఆకాశ్ అంబానీ తెలిపారు.
Reliance Bharatgpt: దేశంలోని అతిపెద్ద టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో కూడా ఏఐ రంగంలోకి అడుగుపెట్టబోతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన పాపులర్ ఓపెన్ఏఐ టూల్ చాట్‌జీపీటీకి పోటీగా జియో నుంచి సరికొత్త ఏఐ ప్రొగ్రామ్ ‘భారత్ జీపీటీ’ పేరుతో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్ ఆకాష్ అంబానీ తెలిపారు. భారత్ జీపీటీ ప్రోగ్రామ్‌ను ప్రారంభించేందుకు తాము ఐఐటీ బాంబేతో కలిసి ఒక ప్రాజెక్ట్‌పై పనిచేస్తున్నామని తెలిపారు.
రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉత్పత్తులు, సేవలు ప్రతి ఏరియాలోనూ మార్పులు తీసుకొస్తాయని అంబానీ చెప్పారు. మీడియా, స్పేస్, వాణిజ్యం, కమ్యూనికేషన్, పరికరాలలో కంపెనీ ఉత్పత్తుల సేవలను ప్రారంభించనుందని ఆకాష్ అంబానీ తెలిపారు. టీవీల కోసం సొంత ఓఎస్‌ను తెచ్చేందుకు పనిచేస్తున్నామని తెలిపారు. జియో తన సేవలను మరింత మెరుగుపరుచుకునేందుకు, కొత్త ఆవిష్కరణలకు సిద్ధమవుతోందని తెలిపారు.
5జీ నెట్‌వర్క్‌లను అందించడం పట్ల కంపెనీ చాలా ఆసక్తితో ఉందని, ఎలాంటి సంస్థకైనా 5జీ స్టాక్‌ను అందిస్తామని ఆకాశ్ చెప్పారు. రాబోయే దశాబ్ధంలో భారత్ అతిపెద్ద ఆవిష్కరణల కేంద్రంగా నిలుస్తుందని, దశాబ్ధం చివరినాటికి దేశం 6 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా మారుతుందని వెల్లడించారు.