»Bhatti Vikramarka Threatening Government Is Not Theirs
Bhatti Vikramarka: బెదిరించే ప్రభుత్వం తమది కాదు
అబ్దుల్లాపూర్మెట్లో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలెవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని భట్టి తెలిపారు.
Bhatti Vikramarka: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్లో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలెవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని.. ఇది ప్రజా ప్రభుత్వమని అన్నారు. మా పార్టీలోకి వస్తేనే ఇల్లు ఇస్తామని బెదిరించే ప్రభుత్వం తమది కాదని భట్టి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆరు గ్యారంటీలను తప్పనిసరిగా అమలు చేసి తీరుతామని వెల్లడించారు. పదేళ్లలో రాష్ట్ర ప్రజలు నీళ్లు, నిధులు, నియామకాలు పొందలేదు. తొమ్మిదేళ్లలో ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని అన్నారు.
ప్రజల చేత ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వం మాది. ప్రజాపాలన అందిస్తామని చెప్పి ఒప్పించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. మాది దొరల ప్రభుత్వం కాదు. ఒక వర్గం, ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ప్రజల సమక్షంలో అమలు చేస్తున్నాం. ప్రతి వంద కుటుంబాలకు ఒక కౌంటర్ పెట్టి మీ దగ్గరకే వచ్చి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపారు. ఈ రాష్ట్రాన్ని, సంపదను ప్రజలకు అంకితం చేస్తామని భట్టి తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, కలెక్టర్ గౌతమ్, రాష్ట్ర ఉన్నతాధికారులు సందీప్ కుమార్ సుల్తానియా, హనుమంతరావు, శ్రుతి ఓజా, రాచకొండ సీపీ సుధీర్ బాబు పాల్గొన్నారు. ఈరోజు నుంచి జనవరి 6వ తేదీ వరకు అభయహస్తం గ్యారంటీ పథకాలకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రజలకు ఎలాంటి అనుమానాలున్నా అధికారులను అడిగి తెలుసుకోవాలన్నారు. అయితే అర్హతను బట్టి లబ్ధి జరుగుతుందని తెలిపారు. హైదరాబాద్లో 600 కేంద్రాల్లో ప్రజాపాలన కార్యక్రమం కొనసాగుతోంది.